ఏపీకి మరో రెండు ఎయిమ్స్‌లు ఇవ్వండి: కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు ఎంపీ లింగమనేని వినతి
- ఏపీలో సూపర్ స్పెషాలిటీ వైద్య రంగాన్ని విస్తరించాలన్న లింగమనేని
- మంగళగిరి ఎయిమ్స్‌ను పూర్తిస్థాయి జాతీయ స్థాయి వైద్య సంస్థగా తీర్చిదిద్దాలని విన్నపం
- రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కొత్త ఎయిమ్స్‌లను ఏర్పాటు చేయాలని వినతి
ఏపీలో సూపర్ స్పెషాలిటీ వైద్య రంగాన్ని విస్తరించేందుకు రాష్ట్రానికి మరో రెండు ఎయిమ్స్ ఆసుపత్రులను కేటాయించాలని జనసేన పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతం సేవలు అందిస్తున్న మంగళగిరి ఎయిమ్స్‌ను పూర్తిస్థాయి జాతీయ స్థాయి వైద్య సంస్థగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఆయన వినతిపత్రం అందజేశారు. దాదాపు ఐదు కోట్ల జనాభా కలిగిన రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న ఒక్క ఎయిమ్స్ ఏమాత్రం సరిపోవడం లేదని స్పష్టం చేశారు.
రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కొత్తగా ఎయిమ్స్‌లను ఏర్పాటు చేయడం వల్ల ప్రాంతీయ అసమానతలు తొలగిపోయి, ప్రజలకు ఆధునిక వైద్యం చేరువవుతుందని పేర్కొన్నారు. గతంలో జమ్మూకశ్మీర్, బీహార్‌లకు ఒకటికి మించి ఎయిమ్స్‌లు మంజూరు చేసిన ప్రాతిపదికన ఏపీకి కూడా అవకాశం ఇవ్వాలని కోరారు. అలాగే మంగళగిరి ఎయిమ్స్‌లో క్యాన్సర్, న్యూరో, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్, కార్డియాక్ వంటి సూపర్ స్పెషాలిటీ విభాగాలకు అదనపు పడకలు, నిపుణులైన వైద్యులు, అత్యాధునిక పరికరాలను కేటాయించి మరింత బలోపేతం చేయాలని ఎంపీ లింగమనేని తన వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు.