డేటా సెంటర్ల హబ్‌గా హైదరాబాద్‌.. విశాఖపై ప్రపంచ దిగ్గజాల చూపు

Hyderabad as data center hub and global giants eye Visakhapatnam
  • విశాఖపై పెరుగుతున్న పెట్టుబడిదారుల ఆసక్తి
  • నైట్‌ ఫ్రాంక్‌ నివేదికలో ముంబయికి ప్రపంచ టాప్-15లో చోటు
  • హైదరాబాద్‌కు భారీ ప్రాజెక్టుల వరుస
  • విశాఖలో గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుల అవకాశాలు
  • క్లౌడ్‌, ఏఐతో పెరుగుతున్న డిమాండ్
  • భారత్‌కు బలపడుతున్న గ్లోబల్ గుర్తింపు
భారత్ డేటా సెంటర్ రంగంలో వేగంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా సెంటర్ కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది. విశాఖపట్నం భారీ స్థాయి కొత్త డేటా సెంటర్ ప్రాజెక్టులకు ఆకర్షణీయ గమ్యంగా మారుతోంది. ఈ విషయాలు నైట్ ఫ్రాంక్ విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడయ్యాయి.

ప్రపంచంలోని 36 ప్రధాన డేటా సెంటర్ మార్కెట్లపై నిర్వహించిన అధ్యయనంలో ముంబయి ఆపరేషనల్ సామర్థ్యం పరంగా 15వ స్థానంలో నిలిచింది. అభివృద్ధి దశలో ఉన్న ప్రాజెక్టుల జాబితాలో 11వ స్థానాన్ని దక్కించుకుంది. హైదరాబాద్ ప్రస్తుతం 151 మెగావాట్ల సామర్థ్యంతో 27వ స్థానంలో ఉన్నా, 2.2 గిగావాట్లకు పైగా అభివృద్ధి ప్రణాళికలతో 19వ స్థానంలో నిలిచి వేగంగా విస్తరిస్తున్న కేంద్రంగా గుర్తింపు పొందింది.

చెన్నై ఆగ్నేయాసియా ఇంటర్నెట్ ట్రాఫిక్‌కు కీలక కేంద్రంగా బలపడుతుండగా, బెంగళూరు గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు, పరిశోధన సంస్థల పెట్టుబడులను ఆకర్షిస్తోంది.

మరోవైపు పూణె, ఢిల్లీ ఎన్‌సీటీ ప్రాంతంలో కూడా డేటా సెంటర్ల సామర్థ్యం పెరుగుతోంది. రెండో శ్రేణి నగరాల్లో విశాఖపట్నం, జామ్‌నగర్ భారీ గ్రీన్‌ఫీల్డ్ డేటా సెంటర్ ప్రాజెక్టులకు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని నివేదిక పేర్కొంది. ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలు, సముద్రగర్భ కేబుల్ కనెక్టివిటీ ప్రణాళికలు ఇందుకు దోహదపడుతున్నాయని వెల్లడించింది.

క్లౌడ్ సేవల వినియోగం పెరగడం, కృత్రిమ మేధ వినియోగం విస్తరించడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదగడం వల్ల భారత్‌లో డేటా సెంటర్లకు డిమాండ్ మరింత పెరుగుతోందని నైట్ ఫ్రాంక్ ఇండియా అభిప్రాయపడింది. విద్యుత్ సరఫరా, మౌలిక వసతుల విస్తరణ, వేగవంతమైన అనుమతులు ఉంటే రానున్న దశాబ్దంలో భారత్ ప్రపంచంలోనే కీలక డేటా సెంటర్ల కేంద్రంగా ఎదిగే అవకాశముందని పేర్కొంది.
Advertisement
Hyderabad
Visakhapatnam
Data Center Hub
Night Frank Report
Digital Infrastructure
Cloud Computing India

More Telugu News