జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ చింతకాయల విజయ్
- సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య పెంపు బిల్లుపై రాజ్యసభలో చర్చ
- జగన్ కేసులలో విచారణ ప్రారంభమై 13 ఏళ్లు గడిచాయన్న విజయ్
- తుది తీర్పు ఎప్పుడు వెలువడుతుందని ప్రశ్న
వైసీపీ అధినేత జగన్‌పై ఉన్న 31 క్రిమినల్ కేసులలో విచారణ ప్రారంభమై 13 ఏళ్లు గడిచినా ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని టీడీపీ రాజ్యసభ ఎంపీ చింతకాయల విజయ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంపు సవరణ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
జగన్‌తో పాటు ఈ సీబీఐ కేసుల్లోని పలువురు నిందితులు కోర్టుల్లో వరుసగా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని, వాటిపై వేర్వేరు న్యాయమూర్తులు విచారణ జరుపుతున్నప్పటికీ... కేసు తుది తీర్పు దశకు వచ్చేసరికే జడ్జీలు బదిలీ అవుతున్నారని విజయ్ గుర్తుచేశారు. జడ్జీల కొరత, వరుస బదిలీల కారణంగా దశాబ్దానికి పైగా విచారణ ప్రక్రియ ముందుకు సాగడం లేదని తెలిపారు.
కేవలం డిశ్చార్జ్ పిటిషన్లకే 13 ఏళ్లు పడితే, ఇక అసలు ట్రయల్ (కేసు విచారణ) ఎప్పుడు మొదలవుతుందని, తుది తీర్పు ఇంకెప్పుడు వెలువడుతుందని నిలదీశారు. ఇది కేవలం ఒక్క జగన్‌కు సంబంధించిన అంశం మాత్రమే కాదని, దేశంలో చట్టపరిపాలన, న్యాయ వ్యవస్థపై సామాన్య ప్రజలకు ఉండే విశ్వాసానికి సంబంధించిన విషయమని అన్నారు. సీబీఐ ప్రత్యేక కోర్టుల పనితీరు, న్యాయమూర్తుల నియామకాలపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆయన కోరారు. విజయ్ ఈ కేసుల అంశాన్ని లేవనెత్తిన సమయంలో వైసీపీ ఎంపీలు సభలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.