ఇంగ్లాండ్ పౌరసత్వం పొందిన పాక్ క్రికెటర్ ఆమిర్.. ఐపీఎల్ 2027లో ఆడటంపై కీలక వ్యాఖ్యలు!
- గతంలో యూకే పౌరసత్వంతో ఐపీఎల్ లో ఆడిన అజర్ మహమూద్
- పాక్ సూపర్ లీగ్ లో విదేశీ ఆటగాడిగా ఆడతానన్న మహమ్మద్ ఆమిర్
- ఐపీఎల్ గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్య
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆమిర్ అధికారికంగా ఇంగ్లాండ్ పౌరసత్వం (యుకే పౌరసత్వం) పొందడంతో ఆయన ఐపీఎల్ (IPL)లో ఆడటంపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. బ్రిటిష్ పాస్‌పోర్ట్ రావడంతో ఆమిర్ ఇప్పుడు ఇంగ్లాండ్ దేశవాళీ క్రికెట్‌తో పాటు 'ది హండ్రెడ్' టోర్నీలో ట్రెంట్ రాకెట్స్ తరఫున లోకల్ ప్లేయర్‌గా బరిలోకి దిగుతున్నాడు.
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా పాక్ ఆటగాళ్లపై ఐపీఎల్‌లో నిషేధం ఉన్నప్పటికీ... గతంలో పాకిస్థాన్ ఆల్‌రౌండర్ అజర్ మహమూద్ బ్రిటిష్ పౌరసత్వం పొంది కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, కేకేఆర్ తరఫున ఐపీఎల్‌లో ఆడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే నిబంధనల ప్రకారం మహమ్మద్ ఆమిర్‌కు కూడా ఇంగ్లాండ్ ప్లేయర్‌గా ఐపీఎల్ వేలంలో పాల్గొనే అర్హత లభించింది.
ఈ సందర్భంగా ఆమిర్ స్పందిస్తూ... "2027 పాకిస్థాన్ సూపర్ లీగ్ లో నేను విదేశీ ప్లేయర్ గా ఆడతాను. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే... నేను అందులో పాల్గొంటానో లేదో ఇప్పటికైతే నాకూ తెలియదు, ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు" అని స్పష్టం చేశాడు. ప్రస్తుతానికి ఐపీఎల్ పాల్గొనడంపై ఎలాంటి ప్రణాళికలు ఖరారు చేయలేదని, ముందుగా ప్రస్తుతం ఆడుతున్న లీగ్‌లపైనే శ్రద్ధ పెట్టినట్లు తెలిపాడు.