ఉక్రెయిన్ కూరగాయల వ్యాపారిని వెంటాడిన రష్యన్ డ్రోన్... వీడియో పంచుకున్న జెలెన్ స్కీ

Volodymyr Zelenskyy shares video of Russian drone chasing Ukraine vegetable vendor
  • ఖేర్సన్‌లో పౌరులపై రష్యా 'డ్రోన్ సఫారీ' నిర్వహిస్తోందని జెలెన్ స్కీ ఆరోపణ
  • కూరగాయలు అమ్ముతున్న వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని డ్రోన్‌తో దాడి
  • రష్యా దురాగతాలను ఆపడానికి ప్రపంచ దేశాలు ఏకం కావాలని పిలుపు
  • రష్యా అకృత్యాలను ఆపకపోతే ఈ యుద్ధం ఇతర దేశాలకు పాకుతుందని హెచ్చరిక
ఖేర్సన్‌లో రష్యా సైనికులు అమాయక పౌరులపై 'డ్రోన్ సఫారీ'కి పాల్పడుతున్నారని, ఇది వారి పైశాచికత్వానికి నిదర్శనమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓ వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని రష్యా డ్రోన్ జరిపిన దాడికి సంబంధించిన వీడియోను ప్రస్తావిస్తూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్మార్గమైన చర్యను ప్రపంచం మొత్తం చూడాలని, రష్యా దురాగడను అరికట్టడానికి ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

బుధవారం జెలెన్ స్కీ మాట్లాడుతూ.. "ఖేర్సన్‌లో రష్యా దళాలు సాగిస్తున్న అకృత్యాలకు మరో వీడియో సాక్ష్యంగా నిలిచింది. కూరగాయలు అమ్ముకుని జీవనం సాగిస్తున్న ఒక సాధారణ వ్యక్తిని రష్యా డ్రోన్ ఉద్దేశపూర్వకంగా వెంబడించి, అతని పక్కనే పేలిపోయింది. ఈ దాడిలో ఆ వ్యక్తి గాయపడ్డాడు. సిగ్గులేని విధంగా రష్యా ఈ నేరాన్ని అంగీకరించడమే కాకుండా, ప్రజలను హింసించడంపై గర్వంగా గొప్పలు చెప్పుకుంటోంది" అని మండిపడ్డారు.

ఖేర్సన్‌లో ప్రతిరోజూ సాధారణ ప్రజలు ఇలాంటి భయానక పరిస్థితులను ఎదుర్కొంటున్నారని జెలెన్ స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. "రష్యా ఒక పిచ్చి దేశంగా మారిందనడానికి, దాని సైనికులు పౌరులను చంపడం, హింసించడంలో ఆనందం పొందుతున్నారనడానికి ప్రతీ సాక్ష్యాన్ని ప్రపంచం గమనించాలి. రష్యాపై ఒత్తిడి తీసుకురాకుండా, దాని దురాక్రమణ సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయకుండా ఈ దుష్టశక్తితో ప్రపంచం కలిసి జీవించడం అసాధ్యం" అని ఆయన స్పష్టం చేశారు.

ఈ యుద్ధం కేవలం ఉక్రెయిన్‌కు మాత్రమే పరిమితం కాదని, మానవ జీవనంపై రష్యా సాగిస్తున్న ఈ దాడిని ఉక్రెయిన్‌లోనే ఆపకపోతే అది ఇతర దేశాలకు విస్తరిస్తుందని జెలెన్ స్కీ హెచ్చరించారు. ఫిన్లాండ్, కజకిస్థాన్, బాల్టిక్ రాష్ట్రాలు, పోలాండ్, రొమేనియా, మోల్డోవా వంటి దేశాలన్నీ ఏకమై రష్యా యుద్ధానికి ముగింపు పలకాలని, శాంతిని కాంక్షించే ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Advertisement
Volodymyr Zelenskyy
Russia Ukraine War
Russian Drone Attack
Kherson Civilian Victims
Drone Safari Ukraine
Ukraine War Crimes

More Telugu News