జగన్ పర్యటనలో భద్రతాలోపం వెనుక పెద్ద కుట్ర ఉంది: గుడివాడ అమర్నాథ్

YS Jagan Mohan Reddy security lapse is a big conspiracy says Gudivada Amarnath
  • తూర్పుగోదావరి జిల్లాలో జగన్ పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై గుడివాడ ఆగ్రహం
  • హెలిప్యాడ్ వద్దకు భారీగా జనం చేరుకున్నప్పటికీ పోలీసులు అదుపు చేయలేదని ఆరోపణ
  • డీజీపీకి నాలుగు సార్లు ఫోన్ చేసినా స్పందించలేదని వ్యాఖ్య

తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా కల్పించిన భద్రతా ఏర్పాట్లపై ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీసు యంత్రాంగం వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. 'జడ్ ప్లస్' కేటగిరి భద్రత కల్పించాల్సిన మాజీ సీఎం హెలిప్యాడ్ వద్దకు భారీగా జనం చేరుకున్నప్పటికీ, వారిని అదుపు చేయడానికి కనీస భద్రతా సిబ్బంది లేకపోవడం కచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆరోపించారు.


ఈ అంశంపై మాట్లాడేందుకు రాష్ట్ర డీజీపీకి తాను ఏకంగా నాలుగు సార్లు ఫోన్ చేసినా ఆయన స్పందించలేదని అమర్‌నాథ్ వెల్లడించారు. క్రితం రోజు సాయంత్రం వరకు ఉన్న పోలీసు బందోబస్తు ఉదయానికల్లా మాయమవడం వెనుక పెద్ద కుట్ర ఉందేమోనన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే ఆ నెపాన్ని జగన్‌పైనే తోసేసేందుకు యత్నిస్తున్నారని, చివరికి తమ పార్టీ యువ కార్యకర్తలే స్వయంగా భద్రతగా నిలబడి పర్యటనను సురక్షితంగా పూర్తి చేశారని తెలిపారు.


మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ... పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేయాలని, అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించాలనుకుంటే పోలీసు యూనిఫాం తీసేసి ‘ఎల్లో డ్రెస్’ వేసుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Advertisement
YS Jagan Mohan Reddy
Gudivada Amarnath
YSRCP
Andhra Pradesh Police
Security Lapse
East Godavari

More Telugu News