ఏఐతో భయపడొద్దు.. భారత్‌కు లాభాలే ఎక్కువ: ప్రపంచ బ్యాంకు

World Bank says do not fear AI as India will benefit more
  • భారత్‌లో ఏఐతో ఉద్యోగాల ముప్పు తక్కువేనన్న ప్రపంచ బ్యాంకు 
  • అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కేవలం 4.5 శాతం ఉద్యోగాలకే ముప్పు
  • 16.2 శాతం ఉద్యోగాల్లో ఉత్పాదకత పెరిగే అవకాశం
  • చిన్న, తక్కువ ఖర్చు ఏఐ వ్యవస్థలపైనే దృష్టి పెట్టాలని సూచన
  • వైద్యం, విద్య, వ్యవసాయంలో ఏఐతో పెద్ద మార్పులు సాధ్యమని నివేదిక
  • విద్యుత్‌, ఇంటర్నెట్‌, నైపుణ్యాలపై పెట్టుబడులు అవసరమని సూచన
కృత్రిమ మేధ (ఏఐ) వల్ల ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనల మధ్య ప్రపంచ బ్యాంకు ఆసక్తికర నివేదిక విడుదల చేసింది. భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏఐ ఉద్యోగాలను భర్తీ చేయడం కంటే, ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది. సరైన చర్యలు తీసుకుంటే శతాబ్దం పట్టే అభివృద్ధిని పదేళ్లలోనే సాధించే అవకాశం ఉందని పేర్కొంది.

ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక ప్రకారం.. అధిక ఆదాయ దేశాల్లో ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో 14.2 శాతం ఏఐ ఆటోమేషన్‌ ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. తక్కువ, మధ్యస్థ ఆదాయ దేశాల్లో మాత్రం ఈ ముప్పు 4.5 శాతమే. అదే సమయంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 16.2 శాతం ఉద్యోగాల్లో ఏఐ వల్ల ఉత్పాదకత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సంఖ్య 18.7 శాతంగా ఉంది.

భారీ ఏఐ మోడళ్లు, ఖరీదైన డేటా సెంటర్ల నిర్మాణం కంటే స్థానిక అవసరాలకు అనుగుణంగా తక్కువ ఖర్చుతో పనిచేసే ఏఐ వ్యవస్థలను వినియోగిస్తే భారత్‌కు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ప్రపంచ బ్యాంకు సూచించింది. విద్య, వైద్యం, వ్యవసాయం, న్యాయ సేవలు, ప్రభుత్వ సేవల్లో ఏఐ కీలక మార్పులు తీసుకురాగలదని అభిప్రాయపడింది. ఇప్పటికే భారత్‌తో పాటు కెన్యా, మెక్సికో, నైజీరియా, థాయ్‌లాండ్‌లో ఐదుగురికి పైగా ఉద్యోగులు ఉన్న సంస్థల్లో ఐదింటిలో ఒకటి ఏఐ చాట్‌బాట్‌లను వినియోగిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.

అయితే విద్యుత్‌, ఇంటర్నెట్‌, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, నాణ్యమైన డేటా, బలమైన వ్యవస్థలు లేకపోతే ఏఐ ప్రయోజనాలు పూర్తిగా అందవని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. దశలవారీగా ఏఐను అమలు చేయాలని, గోప్యతకు రక్షణ కల్పిస్తూ బాధ్యతాయుత వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించింది.
Advertisement
World Bank
Artificial Intelligence India
AI Job Market Impact
World Bank AI Report
India AI Development
AI Productivity Gains

More Telugu News