శ్రీరాముడిపై ప్రకాశ్ రాజ్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు: భానుప్రకాశ్ రెడ్డి
- హిందూ దేవుళ్లపై అనుచిత పోస్టులు పెడుతున్న వారిపై ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
- నోటికొచ్చినట్టు వ్యాఖ్యానించడం సరికాదన్న భానుప్రకాశ్ రెడ్డి
- హిందూ దేవుళ్లను నిందిస్తే తోలు తీస్తామని హెచ్చరిక
సామాజిక మాధ్యమాల్లో హిందూ దేవుళ్లను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై, అలాగే సినీ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ నాయకులు సైబర్ సెల్ డీజీ రవిశంకర్‌కు ఫిర్యాదు చేశారు. మొత్తం 57 మందికి సంబంధించిన వివరాలను సైబర్ పోలీసులకు అందజేశారు. డీజీకి ఫిర్యాదు చేసిన బృందంలో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డితో పాటు ఇతర బీజేపీ నేతలు వల్లూరు జయప్రకాశ్, షేక్ బాజీ, శ్రీనివాసరెడ్డి ఉన్నారు.
ఈ సందర్భంగా భానుప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ... హిందూ సంస్కృతి, సాంప్రదాయాలలో శ్రీరామచంద్రుడిని ఆరాధ్య దైవంగా, లక్ష్మీదేవి, సరస్వతి, సీతాదేవిలను పవిత్ర మాతృమూర్తులుగా భావించి పూజిస్తామని గుర్తుచేశారు. కానీ కొందరు వ్యక్తులు నెట్టింట హిందూ దేవతామూర్తులను ఉద్దేశించి అసభ్యకర రీతిలో నోటికొచ్చినట్లు వ్యాఖ్యానించడం సహించరానిదని మండిపడ్డారు.
ముఖ్యంగా నటుడు ప్రకాశ్ రాజ్ శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. దమ్ము, ధైర్యం ఉంటే ఇతర మతాల్లో జరిగే అన్యాయాలపై మాట్లాడాలని సవాల్ విసిరిన ఆయన... హిందూ దేవుళ్లను నిందిస్తే 'తోలు తీస్తాం, వదిలేది లేదు' అని హెచ్చరించారు. అలాంటి వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సైబర్ పోలీసులను డిమాండ్ చేశారు.