కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌తో రేవంత్ రెడ్డి భేటీ
- ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్న రేవంత్ రెడ్డి
- కీలక ప్రాజెక్టులకు పర్యావరణ క్లియరెన్స్ ఇవ్వాలని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ కు వినతి
- కాసేపట్లో కాంగ్రెస్ అధిష్ఠానంతో భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన రాజకీయంగా, అభివృద్ధి పరంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఉదయం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌తో సమావేశమైన రేవంత్ రెడ్డి... రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు కీలక ప్రాజెక్టులకు తక్షణమే అటవీ, పర్యావరణ క్లియరెన్స్ ఇచ్చి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు.
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్న ఈ సమావేశం అనంతరం, సీఎం జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ కానున్నారు. గోదావరి-కృష్ణా నదీ జలాల పంపిణీ, ఆంధ్రప్రదేశ్‌తో ఉన్న జల వివాదాలు, కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ వంటి ప్రాధాన్యత కలిగిన అంశాలపై చర్చించనున్నారు.
కేంద్ర మంత్రులతో వరుస సమావేశాల అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలతో భేటీ కానున్నట్లు సమాచారం. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో మంత్రివర్గ కూర్పును విజయవంతంగా కొలిక్కి తెచ్చిన హైకమాండ్, ఇప్పుడు తెలంగాణలో కూడా పెండింగ్‌లో ఉన్న కేబినెట్ విస్తరణపై దృష్టి సారించింది.
రాజీనామా బెదిరింపులకు వెనక్కి తగ్గకుండా కర్ణాటకలో ప్రయోగించిన 'కఠిన వైఖరి' ఫార్ములానే తెలంగాణలోనూ వర్తింపజేసి, మంత్రిపదవుల ఆశావహుల అసంతృప్తులకు చెక్ పెట్టాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ఈ భేటీ తర్వాత తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఏఐసీసీ నుంచి కీలక ప్రకటన వెలువడే అవకాశాలు ఉండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.