సమ్మక్క-సారక్క ప్రాజెక్టుపై చంద్రబాబుతో రేవంత్ కుమ్మక్కయ్యారా?: హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు

Harish Rao questions Revanth Reddy on Sammakka Sarakka project collusion with Chandrababu Naidu
  • సమ్మక్క సాగర్ నీళ్లను ఏపీకి ధారాదత్తం చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధపడిందన్న హరీశ్
  • దీనిపై రేవంత్ నోరు విప్పాలని డిమాండ్
  • తెలంగాణ ప్రజల నోటికాడి ముద్దను లాక్కునేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని మండిపాటు

కర్ణాటకలో జరిగిన ముగ్గురు ముఖ్యమంత్రుల భేటీ అనంతరం సమ్మక్క-సారక్క (సమ్మక్క సాగర్) ప్రాజెక్టుకు చెందిన తెలంగాణ వాటా నీళ్లను ఆంధ్రప్రదేశ్‌కు దారాదత్తం చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధపడిందంటూ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన... తెలంగాణ ప్రజలకు సంబంధించిన అత్యంత కీలకమైన నీటి హక్కులపై కాంగ్రెస్ ప్రభుత్వం మౌనం వహించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


కర్ణాటకలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక సీఎంల సమావేశం, తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవం తర్వాత సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి మన రాష్ట్రానికి చెందిన 47 టీఎంసీల వాటాను ఏపీ కోసం వదులుకోవడానికి సిద్ధపడ్డారనే వార్తలు నెట్టింట వ్యాపిస్తున్నాయని... దీనిపై సీఎం రేవంత్ రెడ్డి నోరు విప్పాలని డిమాండ్ చేశారు. గోదావరి నదీ యాజమాన్య బోర్డు అజెండాలో సమ్మక్క సాగర్‌కు 47 టీఎంసీలు కేటాయించే ప్రసక్తే లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసినా, ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కనీసం స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందని మండిపడ్డారు.


తమ కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే సమ్మక్క సాగర్ 47 టీఎంసీల ప్రాజెక్టుకు అవసరమైన అన్ని రకాల కేంద్ర అనుమతులు తీసుకొచ్చామని హరీశ్ రావు గుర్తుచేశారు. ఆఖరికి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గానికి కూడా ఫలాలను అందించే ఈ నీటి కేటాయింపులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా వదులుకుంటుందని ప్రశ్నించారు. 


చంద్రబాబు మళ్లీ తెలంగాణ ప్రజల నోటికాడి ముద్దను లాక్కునేందుకు కుట్రలు పన్నుతున్నారని, తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేలా కేంద్రానికి లేఖలు రాయడమే కాకుండా బోర్డు సమావేశాల్లో పాత అనుమతులను రద్దు చేయాలని ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు. పోరాటాలతో సాధించుకున్న తెలంగాణకు నీటి విషయంలో అన్యాయం జరిగితే సహించేది లేదని, జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబును ఈ సందర్భంగా హెచ్చరించారు.

Advertisement
Harish Rao
Revanth Reddy
Chandrababu Naidu
Sammakka Sarakka Project
Telangana Water Rights
Godavari River Management Board

More Telugu News