శ్రీకాంత్ - ముఖేశ్ రిషి ప్రధానమైన పాత్రలను పోషించిన వెబ్ సిరీస్ 'అబ్జెక్షన్ మై లార్డ్'. సంతోష్ అయ్యప్పన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, జులై 31వ తేదీ నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది.కోర్టు రూమ్ నేపథ్యంలో నడిచే ఈ కథను 7 ఎపిసోడ్స్ గా అందించారు. గతంలో 'జీ 5' లోనే స్ట్రీమింగ్ జరుపుకున్న తమిళ సిరీస్ 'సట్టముమ్ నీతియుమ్'కి ఇది తెలుగు రీమేక్. తమిళ మూలం మెప్పించిందా? తెలుగు రీమేక్ ఆకట్టుకుందా? అనేది ఇప్పుడు చూద్దాం.
పరశురామ్ (శ్రీకాంత్) ఓ లాయర్. కొన్ని కారణాల వలన నల్లకోటు పక్కన పెట్టేసి, కోర్టు ఆవరణలో నోటరీలు రాసుకుంటూ ఉంటాడు. ఆయనలోని నిజాయితీ పరుడిని చాలామంది గౌరవిస్తుంటారు. ఆ నిజాయితీని అర్థం చేసుకోలేనివాళ్లు, సంపాదించుకోవడం చేతకాని అసమర్థుడనే అనుకుంటారు. పరశురామ్ భార్య 'ఇందు'కి ఆయన ఏంటన్నది తెలుసు. అలాగే కూతురు 'కీర్తి' కూడా తండ్రి పరిస్థితిని అర్థం చేసుకుంటుంది. కొడుకు మాత్రం తండ్రి ధోరణి పట్ల అసహనంగా ఉంటాడు. తన కాలేజ్ ఫీజ్ కట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్న తండ్రి పట్ల ఒక రకమైన కోపం అది.
ఆ కోర్టు ఆవరణలో 'నారాయణ' అనే వ్యక్తి తనని తాను తగలబెట్టుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ సమయంలోనే 'వేద' (అనన్య శర్మ) ఆ కోర్టు ప్రాంగణంలో అడుగుపెడుతుంది. కేసులు వాదించ కూడదని నిర్ణయించుకున్న పరశురామ్ ఆలోచనలో మార్పు తీసుకొస్తుంది. అదే కేసుతో పరశురామ్ దగ్గర జూనియర్ గా చేరుతుంది. చాలా కాలం తరువాత అతను నల్లకోటు వేసుకోవడంతో, అతని సహచరులతో పాటు అందరూ ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా సీనియర్ లాయర్ విశ్వనాథ్ (ముఖేశ్ రిషి )కి మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పరశురామ్ కి వ్యతిరేకంగా వాదించడానికి రంగంలోకి దిగింది అతనే. ఈ కేసు వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయనేది పరశురామ్ కి అర్థమైంది కూడా అప్పుడే.
నారాయణ తన కూతురు 'సమీరా' (స్నేహాల్) కిడ్నాప్ కి గురైందనీ, ఆ కేసు తీసుకోమని లాయర్లను బ్రతిమాలుకోవడం పరశురామ్ కి తెలుసు. ఒక శ్రీమంతుడి కొడుకు స్నేహితులతో కలిసి తన కూతురును ఎత్తుకెళ్లాడనీ, ఆ కారు నెంబర్ లో ఓ నాలుగు అంకెలు తనకి గుర్తున్నాయని చెప్పడం పరశురామ్ విని ఉన్నాడు. నారాయణకు ఆత్మశాంతి కలగాలంటే, అతని కూతురు సమీరా ఆచూకీ తెలుసుకోవాలనే పట్టుదలతో పరశురామ్ ఉంటాడు. ఎలాంటి పరిస్థితులలోను సమీరా వాళ్లకి దొరక్కూడదని విశ్వనాథ్ భావిస్తాడు.
పరశురామ్ చాలాకాలంగా నల్లకోటు పక్కన పెట్టడానికి గల కారణం ఏమిటి? సమీరా ఆచూకీ తెలుసుకునే విషయంలో ఆయన ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటాడు? సమీరాను కిడ్నాప్ చేసింది ఎవరు? వాళ్లను కాపాడటం కోసం విశ్వనాథ్ చేసే ప్రయత్నం ఫలిస్తుందా? అనేది మిగతా కథ.
ఈ కథ అంతా కూడా సమీరా అనే ఒక యువతి చుట్టూ తిరుగుతుంది. కిడ్నాప్ చేయబడిన తన కూతురు సమీరా ఆచూకీ తెలుసుకుని, తనకి న్యాయం చేయమని అభ్యర్థించే ఒక పేద తండ్రి ఆవేదనతో ఈ కథ మొదలవుతుంది. అతని ఆత్మహత్యతో ఈ కథ బలపడుతుంది. తన తెలివి తేటలు .. అనుభవం .. నిజాయితీ, ఒక పేద తండ్రి మరణానికి అర్థం ఉండేలా చేస్తే చాలని భావించి పరశురామ్ రంగంలోకి దిగడంతో కథ పుంజుకుంటుంది.
ఇక ఇక్కడి నుంచి పరశురామ్ ఆలోచనలు .. జూనియర్ సంపాదించే ఆధారాలు .. కోర్టులో నడిచే వాదోపవాదాలు .. అజ్ఞాత శత్రువులు పన్నే వ్యూహాలతో ఈ కథ మలుపులు తీసుకుంటూ వెళ్లాలి. మలుపులైతే ఉన్నాయి .. కానీ అవి ఆసక్తికరంగా ఆవిష్కృతం కాకపోవడమే అసంతృప్తిని కలిగిస్తుంది. ఆధారాల కోసం ఒకరు .. అవి దొరక్కుండా చేస్తూ ఒకరు నువ్వా నేనా అన్నట్టుగా పరశురామ్ - విశ్వనాథ్ మధ్య వాదోపవాదాల వార్ నడవాలి .. కానీ అది అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు.
నేను నల్లకోటు వేసుకోను .. కోర్టు మెట్లు ఎక్కనని పరశురామ్ కొన్నేళ్లుగా భీష్మించుకుంటాడు. అందుకు బలమైన కారణమేదో ఉంటుందని భావించిన ఆడియన్స్ కి నిరాశే ఎదురవుతుంది. అలాగే సమీరా మిస్సింగ్ వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందని భావించినవారికి కూడా అసంతృప్తియే మిగులుతుంది. ఈ కథలో విలన్ లేడా అంటే .. ఉన్నాడు. కానీ అంతా ముఖేశ్ రిషికి అప్పగించి స్లీపింగ్ పార్ట్నర్ గా కనిపిస్తాడు.
సాధారణంగా కోర్టు రూమ్ డ్రామాలలో ఆడియన్స్ ను కదలకుండా చేసే అంశాలు రెండే రెండు. కోర్టు రూమ్ లో ఆసక్తికరంగా నడిచే వాదోపవాదాలు. కోర్టు బయట ఆధారాలు సేకరించే విషయంలో పోటీపడటం. ఈ రెండు విషయాలలోను ఈ సిరీస్ తన జోరు చూపించలేదేమో అనిపిస్తుంది. కథ ముందుకు వెళుతున్నా కొద్దీ బలపడవలసిందిపోయి, తేలిపోతుంటుంది.
తమిళంలో రూపొందిన 'సట్టముమ్ నీతియుమ్' సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సిరీస్ కి ఇది రీమేక్ అయినప్పటికీ, అందులోని ఆత్మ ఇందులో కనిపించదు. అక్కడ కూడా కథాకథనాలు .. కోర్టులో వాదోపవాదాలు నిదానంగానే నడుస్తాయి. అయితే ఆ సిరీస్ లోని సహజత్వం .. ఎమోషన్స్ ను ఆవిష్కరించిన విధానం ఇక్కడ కనిపించదు. అక్కడ సంభాషణలు తక్కువగా ఉన్నప్పటికీ, సన్నివేశాలు బలంగా అనిపిస్తాయి. ఇక్కడ అది లోపించింది.
నటన పరంగా శ్రీకాంత్ కీ .. ముఖేశ్ రిషికి వంకబెట్టవలసిన పనిలేదు. అనన్య ..స్నేహాల్ తో పాటు మిగతా వాళ్లంతా బాగానే చేశారు. సూర్య ఫొటోగ్రఫీ .. అరుణ్ చిలువేరు నేపథ్య సంగీతం .. సాయి కిశోర్ ఎడిటింగ్ ఫరవాలేదు. తమిళ మూలంతో పోల్చుకుంటే, 'అబ్జెక్షన్ మై లార్డ్' ఓ మాదిరిగా అనిపిస్తుందంతే.
'అబ్జెక్షన్ మై లార్డ్' (జీ 5) సిరీస్ రివ్యూ!
Objection My Lord Review
Movie Details
Movie Name: Objection My Lord
Release Date: 2026-07-31
Cast: Srikanth,Mukesh Rishi ,Ananya Sharma,Snehal Kamat,Sameer
Director: Santhosh Ayyappan
Music: Aruun Chiluveru
Banner: Dream House Productions
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer