వైసీపీని మూసుకోవడమే ఉత్తమం: నారా లోకేశ్ రాజీనామా డిమాండ్‌పై యనమల తీవ్ర ఆగ్రహం!

Yanamala Ramakrishnudu slams YSRCP over Nara Lokesh resignation demand
  • వైసీపీ డిమాండ్ అసంబద్ధమైనదన్న యనమల
  • ఆ పార్టీ వెంటిలేటర్ పై ఉందని ఎద్దేవా
  • రాష్ట్ర అభివృద్ధికి వైసీపీ అవరోధంగా మారిందని విమర్శ

మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలంటూ వైసీపీ చేస్తున్న రచ్చపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు నిప్పులు చెరిగారు. వైసీపీ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టిన ఆయన.. ఆ డిమాండ్ పూర్తిగా అసంబద్ధమైనదని, ఆమోదయోగ్యం కాదని తెగేసి చెప్పారు.


ముఖ్యంగా, తమను తాము నవతరం 'జెన్-జీ' నేతలుగా ఊహించుకుంటున్న వైసీపీ నాయకులు... 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలచే తిరస్కరించబడిన 'జెన్-ఎక్స్' నాయకులని ముందుగా తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్ల పాలనలో విధ్వంసం, దోపిడీనే ధ్యేయంగా పనిచేసిన ఆ పార్టీ ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఊపిరి పీల్చుకుంటోందని వ్యాఖ్యానించారు. కేవలం సొంత రాజకీయ ఉనికి కోసం ఆడుతున్న నాటకాలు, పగటి వేషాలు, నకిలీ నినాదాలను చూసి ప్రజలు మళ్లీ మోసపోరని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఎలాగో ఆ పార్టీకి భవిష్యత్తు లేదని, దుకాణం శాశ్వతంగా మూసుకోవడమే వారికి ఏకైక మార్గమని యనమల విమర్శించారు.


ఏపీ సర్వతోముఖాభివృద్ధికి వైసీపీ ఒక పెద్ద 'స్పీడ్ బ్రేకర్'లా తయారైందని, కొత్తగా వచ్చే పెట్టుబడిదారులను సైతం బెదిరింపులకు గురిచేస్తోందని యనమల మండిపడ్డారు. డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల వ్యవహారంలో కోర్టుకెళ్లిన వైసీపీకి అక్కడ కనీసం పిటిషన్ దాఖలు చేసే అర్హత కూడా లేదని న్యాయస్థానమే తోసిపుచ్చిందని గుర్తుచేశారు. ఆర్థిక, క్రిమినల్ నేరాల్లో ఇరుక్కున్న నాయకుల కేసుల విచారణను రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా వేగవంతం చేయాలని ఈ సందర్భంగా న్యాయస్థానాలకు విజ్ఞప్తి చేశారు. 

Advertisement
Yanamala Ramakrishnudu
Nara Lokesh
YSRCP
TDP
Andhra Pradesh Politics
Lokesh Resignation Demand

More Telugu News