యాప్ స్టోర్ నుంచి టెలిగ్రామ్ తొలగింపు.. వెంటనే పునరుద్ధరణ.. అసలేం జరిగింది?
Add ap7am to your home Screen

యాప్ స్టోర్ నుంచి టెలిగ్రామ్ తొలగింపు.. వెంటనే పునరుద్ధరణ.. అసలేం జరిగింది?

Telegram removed from App Store and restored immediately what happened
  • కొన్ని దేశాల్లో యాపిల్ యాప్ స్టోర్ నుంచి టెలిగ్రామ్ తొలగింపు
  • వివాదాస్పద కంటెంట్ వల్లే ఈ చర్య తీసుకున్నట్టు యాపిల్ వెల్లడి
  • సమస్యను పరిష్కరించడంతో యాప్‌ తిరిగి పునరుద్ధరణ
  • భారత యూజర్లపై ఈ తొలగింపు ప్రభావం నిల్
  • ఇండియాలో నీట్ లీక్స్, సైబర్ నేరాల ఆరోపణలతో చిక్కుల్లో టెలిగ్రామ్
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. యాపిల్ తన యాప్ స్టోర్ నుంచి టెలిగ్రామ్‌ను కొన్ని దేశాల్లో తాత్కాలికంగా తొలగించింది. పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ ఉన్నట్టు గుర్తించడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు యాపిల్ తెలిపింది. అయితే, టెలిగ్రామ్ వెంటనే స్పందించి ఆ కంటెంట్‌ను తొలగించడంతో యాప్‌ను తిరిగి పునరుద్ధరించింది.

సోమవారం పలు దేశాల్లోని ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లు యాప్ స్టోర్లో టెలిగ్రామ్ కోసం వెతకగా అది కనిపించలేదు. అయితే, ఈ తొలగింపు ప్రభావం భారత్‌పై పడలేదు. భారత యూజర్లు యథావిధిగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఆండ్రాయిడ్ ప్లే స్టోర్‌లో, మ్యాక్ యాప్ స్టోర్‌లో కూడా టెలిగ్రామ్ అందుబాటులోనే ఉంది. ఇప్పటికే ఇన్‌స్టాల్ చేసుకున్న యూజర్లకు సేవల్లో ఎలాంటి అంతరాయం కలగలేదు.

ఈ విషయంపై బ్లూమ్‌బర్గ్‌కు చెందిన మార్క్ గుర్మాన్ యాపిల్ ప్రకటనను షేర్ చేశారు. తమ కఠిన నిబంధనలను ఉల్లంఘించే చైల్డ్ అబ్యూజ్ కంటెంట్ ఉన్నందున టెలిగ్రామ్‌ను తాత్కాలికంగా తొలగించామని యాపిల్ పేర్కొంది. డెవలపర్ ఆ కంటెంట్‌ను వెంటనే తొలగించి, పోస్ట్ చేసిన యూజర్‌ను బ్యాన్ చేయడంతో యాప్‌ను తిరిగి పునరుద్ధరించామని వివరించింది.

టెలిగ్రామ్‌ను యాపిల్ తొలగించడం ఇది మొదటిసారి కాదు. 2018లో కూడా అనుచిత కంటెంట్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా యాప్‌ను తొలగించింది. బ్రెజిల్, చైనా వంటి దేశాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు టెలిగ్రామ్‌పై గతంలో నిషేధం విధించారు.

ఇక గత కొంతకాలంగా భారత్‌లోనూ టెలిగ్రామ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇటీవల నీట్ పరీక్ష పత్రాల లీకేజీ ఆరోపణల నేపథ్యంలో ఈ యాప్‌పై నిఘా పెరిగింది. సైబర్ నేరాలకు టెలిగ్రామ్ "కొత్త డార్క్ వెబ్"గా మారిందని ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం వాదించడం గమనార్హం.
Advertisement
Telegram
Apple App Store
Child Abuse Content
Telegram App Ban
Mark Gurman
NEET Paper Leak

More Telugu News