అమెరికా క్రికెటర్ అఖిలేశ్ రెడ్డిపై ఐసీసీ నిషేధం... ఎందుకంటే..!

ICC bans USA cricketer Akhilesh Reddy for eight years
  • అమెరికా క్రికెటర్ అఖిలేష్ రెడ్డిపై ఐసీసీ 8 ఏళ్ల నిషేధం
  • అబుదాబి టీ10 లీగ్‌లో అవినీతికి పాల్పడినట్టు నిర్ధారణ
  • సహచర బౌలర్‌ను ఎక్కువ పరుగులు ఇవ్వాలని కోరిన వైనం
  • ఫోన్‌లోని వాట్సాప్, కాల్ లాగ్స్ డిలీట్ చేసి విచారణను తప్పుదోవ పట్టించే యత్నం
అంతర్జాతీయ క్రికెట్‌లో మరో అవినీతి ఉదంతం కలకలం రేపింది. అమెరికా (యూఎస్ఏ) క్రికెటర్ బొడుగం అఖిలేశ్ రెడ్డిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎనిమిదేళ్ల పాటు నిషేధం విధించింది. 2025లో జరిగిన అబుదాబి టీ10 లీగ్‌లో అఖిలేశ్ రెడ్డి అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించినట్లు తేలడంతో ఐసీసీ ఈ కఠిన చర్యలు తీసుకుంది. ఈ నిషేధం 2025 నవంబర్ 21 నుంచే అమల్లోకి వచ్చినట్లు ఐసీసీ వెల్లడించింది.

ఐసీసీ యాంటీ కరప్షన్ ట్రైబ్యునల్ విచారణలో అఖిలేశ్ రెడ్డిపై మూడు ప్రధాన ఆరోపణలు రుజువయ్యాయి. టీ10 లీగ్‌లో మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించడం, సహచర ఆటగాడిని ఉద్దేశపూర్వకంగా ఎక్కువ పరుగులు ఇవ్వాలని కోరడం, విచారణను అడ్డుకునే ఉద్దేశంతో తన ఫోన్‌లోని వాట్సాప్ సందేశాలు, కాల్ లాగ్‌లను డిలీట్ చేయడం వంటి నేరాలకు పాల్పడినట్లు ట్రైబ్యునల్ నిర్ధారించింది.

2025 నవంబర్ 19న అస్పిన్ స్టాలియన్స్ జట్టు తమ తొలి మ్యాచ్ ఆడటానికి ముందురోజు, అఖిలేశ్ రెడ్డి హోటల్ గదిలో తన సహచర బౌలర్‌ను కలిసి, ఎక్కువ పరుగులు ఇవ్వాలని కోరాడు. టీమ్ మేనేజ్‌మెంట్ సూచన మేరకే తాను ఇలా అడుగుతున్నట్లు అతడిని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, సదరు ఆటగాడు ఇందుకు నిరాకరించి, ఈ విషయాన్ని వెంటనే ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్‌ దృష్టికి తీసుకెళ్లాడు. విచారణలో భాగంగా ఫోన్‌లోని డేటాను డిలీట్ చేయడంపై అఖిలేశ్ ఇచ్చిన వివరణలను ట్రైబ్యునల్ తోసిపుచ్చింది. 26 ఏళ్ల అఖిలేశ్ రెడ్డి అమెరికా తరఫున ఇప్పటివరకు నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
Advertisement
Akhilesh Reddy
ICC Ban
USA Cricket
Abu Dhabi T10 League
Match Fixing
Anti Corruption Code

More Telugu News