కువైట్‌లో చిక్కుకున్న కోనసీమ మహిళ.. కలెక్టర్ చొరవతో స్వదేశానికి

Kanakadurga Konaseema woman stranded in Kuwait returns home with Collector initiative
  • కువైట్‌లో గాయపడి చిక్కుకుపోయిన కోనసీమ మహిళ
  • స్వదేశానికి పంపేందుకు రూ.2 లక్షలు డిమాండ్ చేసిన ఏజెంట్
  • రంగంలోకి దిగిన జిల్లా కలెక్టర్, కోనసీమ వలసదారుల కేంద్రం
  • అధికారుల కృషితో నిన్న‌ స్వగ్రామానికి చేరిన బాధితురాలు
ఉపాధి కోసం కువైట్ వెళ్లి అక్కడ గాయపడి చిక్కుకుపోయిన కోనసీమ జిల్లాకు చెందిన మహిళ, జిల్లా యంత్రాంగం చొరవతో నిన్న‌ సురక్షితంగా స్వగ్రామానికి తిరిగి వచ్చారు. బాధితురాలిని స్వదేశానికి పంపేందుకు ఏజెంట్ డబ్బు డిమాండ్ చేయడంతో అధికారులు జోక్యం చేసుకుని ఆమెను రప్పించారు.

వివరాల్లోకి వెళితే.. కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం తొత్తరమూడి గ్రామానికి చెందిన ఎం. కనకదుర్గ, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఏజెంట్ ద్వారా ఈ ఏడాది జూన్‌లో కువైట్‌కు వెళ్లారు. అక్కడ పని చేసే చోట ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి జారిపడటంతో ఆమె వెన్నెముకకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను తిరిగి పంపించాలని కోరగా, ప్రయాణ ఖర్చుల కోసం ఏజెంట్ రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు బాధితురాలు ఆరోపించారు.

ఈ విషయంపై కనకదుర్గ బంధువులు కోనసీమ వలసదారుల కేంద్రాన్ని (కేసీఎం) ఆశ్రయించారు. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ ఆర్. మహేశ్‌ కుమార్.. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. కేసీఎం నోడల్ ఆఫీసర్ వి. సుబ్బారావు, కోఆర్డినేటర్ గొల్ల రమేశ్‌ మాట్లాడుతూ.. ఏజెంట్, బాధితురాలి బంధువుల సహకారంతో కనకదుర్గ నిన్న‌ తన గ్రామానికి క్షేమంగా చేరుకున్నారని తెలిపారు. ఆమెను కేసీఎం సభ్యులు కడియాల సత్తిబాబు, షేక్ బీబీ తదితరులు కలిశారు.
Advertisement
Kanakadurga
Konaseema District
Kuwait Stranded Woman
Collector Mahesh Kumar
Konaseema Migrants Center
Andhra Pradesh Migrants

More Telugu News