‘100 శాతం..’ క్లెయిమ్‌లతో ఉత్పత్తులు అమ్మొద్దు.. డాబర్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు!

Dabur India told by FSSAI to stop selling products with 100 percent claims
  • తేనె, నెయ్యి సహా పలు డాబర్‌ ఉత్పత్తులపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అభ్యంతరం
  • ‘100 శాతం నేచురల్’, ‘100 శాతం ప్యూర్’, ‘100 శాతం ఆర్గానిక్’ క్లెయిమ్స్‌ నిర్ధారించడం సాధ్యం కాదని స్పష్టీకరణ
  • జైవిక్ భారత్ లోగోపైనా అభ్యంతరం
  • విక్రయాలు నిలిపివేయాలని ఆదేశం
  • 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచన
‘100 శాతం నేచురల్’, ‘100 శాతం ప్యూర్’, ‘100 శాతం ఆర్గానిక్’ వంటి క్లెయిమ్‌లతో విక్రయిస్తున్న పలు ఆహార ఉత్పత్తులను వెంటనే నిలిపివేయాలని డాబర్ ఇండియాకు భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి క్లెయిమ్‌లు స్పష్టత లేనివని, నిర్ధారించడం సాధ్యం కాదని, వినియోగదారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని పేర్కొంది.

తేనె, యాపిల్ సైడర్ వెనిగర్, వర్జిన్ కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆవు నెయ్యి, కొబ్బరి నీరు, కొబ్బరి పాల వంటి ఉత్పత్తులపై ‘100 శాతం’ వంటి క్లెయిమ్‌లను డాబర్ వినియోగించినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వెల్లడించింది.

ఈ క్లెయిమ్‌లు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (అడ్వర్టైజింగ్ అండ్ క్లెయిమ్స్) రెగ్యులేషన్స్-2018కు విరుద్ధమని తెలిపింది. డాబర్ హిమాలయన్ ఆర్గానిక్ యాపిల్ సైడర్ వెనిగర్, డాబర్ ఆర్గానిక్ హనీపై చెల్లుబాటు అయ్యే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆర్గానిక్ ఆమోదం లేకుండానే జైవిక్ భారత్ లోగోను ప్రదర్శించినట్లు గుర్తించింది. అలాగే డాబర్ హోమ్‌మేడ్ కొబ్బరి పాలపై ‘100 శాతం ప్యూరిటీ’ క్లెయిమ్ కూడా నిబంధనలకు అనుగుణం కాదని పేర్కొంది.

ఇలాంటి క్లెయిమ్‌లను నిలిపివేయాలని గతంలోనే నోటీసు జారీ చేసినా డాబర్ తగిన చర్యలు తీసుకోలేదని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపింది. దీంతో నోటీసులో పేర్కొన్న ఉత్పత్తులతో పాటు ‘100 శాతం’ క్లెయిమ్‌లు ఉన్న ఇతర ఆహార ఉత్పత్తుల విక్రయాలను కూడా వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. తీసుకున్న చర్యలపై 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించింది.

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసు అందిందని డాబర్ వెల్లడించింది. నోటీసులో ప్రస్తావించిన అంశాలను పరిశీలిస్తున్నామని తమ వెబ్‌సైట్‌లో తెలిపింది.
Advertisement
Dabur India
FSSAI
Misleading Advertisements
Food Safety Regulations
Organic Food Claims
Dabur Honey

More Telugu News