సేవింగ్స్ అకౌంటులో డబ్బు ఎక్కువ ఉందా?.. స్వీప్-ఇన్ ఎఫ్‌డీతో ఎక్కువ వడ్డీ!

Sweep in FD offers higher interest on idle bank balance and instant cash
  • అదనపు నగదు ఆటోమేటిగ్గా ఎఫ్‌డీకి
  • అవసరమైతే కొంత మొత్తం మాత్రమే వెనక్కి
  • మిగిలిన డబ్బుకు ఎఫ్‌డీ వడ్డీ
  • సేవింగ్స్‌ ఖాతా కంటే ఎక్కువ వడ్డీ
  • ఉద్యోగులు, వ్యాపారులకు ఉపయోగకరం
  • దీర్ఘకాల పెట్టుబడికి ప్రత్యామ్నాయం కాదు
బ్యాంకు సేవింగ్స్‌ ఖాతాలో పెద్ద మొత్తం అలాగే ఉండిపోవడం చాలా మందిలో కనిపించే అలవాటు. అత్యవసరం వస్తే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో డబ్బు ఖాతాలోనే ఉంచేస్తారు. కానీ అలాంటి మొత్తం తక్కువ వడ్డీకే పరిమితమవుతుంది. అదే డబ్బు అవసరమైనప్పుడు చేతిలో ఉండేలా చూసుకుంటూ, ఎక్కువ వడ్డీ కూడా సంపాదించే అవకాశం స్వీప్-ఇన్ ఎఫ్‌డీ రూపంలో ఉంది. ఖాతాలోని అదనపు నగదును తెలివిగా వినియోగించుకునే మార్గంగా దీన్ని నిపుణులు సూచిస్తున్నారు.

స్వీప్-ఇన్ ఎఫ్‌డీ అంటే?
స్వీప్-ఇన్ ఎఫ్‌డీ అంటే సేవింగ్స్‌ ఖాతాకు అనుసంధానమైన ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ సదుపాయం. ఖాతాలో కనీసంగా ఎంత మొత్తం ఉండాలనేది ముందుగానే నిర్ణయించుకోవాలి. ఆ పరిమితిని మించి డబ్బు జమైతే మిగిలిన మొత్తం ఆటోమేటిక్‌గా ఎఫ్‌డీగా మారుతుంది.

ఉదాహరణకు ఖాతాలో రూ.1 లక్ష ఉండేలా నిర్ణయిస్తే, మొత్తం రూ.3 లక్షలు ఉన్నప్పుడు అదనంగా ఉన్న రూ.2 లక్షలు ఎఫ్‌డీకి వెళ్లిపోతాయి. ఇలా ఖాళీగా ఉండే డబ్బుకు కూడా ఎఫ్‌డీ వడ్డీ లభిస్తుంది.

అవసరమైతే వెంటనే నగదు
ఒక్కసారిగా రూ.50 వేల అవసరం వచ్చినా మొత్తం ఎఫ్‌డీని రద్దు చేయాల్సిన పని ఉండదు. అవసరమైన మొత్తం మాత్రమే ఎఫ్‌డీ నుంచి తిరిగి సేవింగ్స్‌ ఖాతాకు వస్తుంది. మిగిలిన మొత్తం యథావిధిగా ఎఫ్‌డీ వడ్డీ పొందుతూ కొనసాగుతుంది. అయితే ఈ విధానం ఒక్కో బ్యాంకులో ఒక్కోలా ఉండే అవకాశం ఉంది. అందుకే ఖాతా తెరవకముందు నిబంధనలు తెలుసుకోవడం మంచిది.

ఎవరికి ఎక్కువ ఉపయోగం?
నెలనెలా జీతం వచ్చే ఉద్యోగులు, వ్యాపారులు, పదవీ విరమణ చేసినవారు, ఖాతాలో తరచూ పెద్ద మొత్తం నిల్వ ఉంచేవారికి ఈ సదుపాయం బాగా ఉపయోగపడుతుంది. అత్యవసర నిధిని అందుబాటులో ఉంచుకోవాలనుకునేవారికి కూడా ఇది అనుకూలమే. అయితే దీన్ని దీర్ఘకాల పెట్టుబడికి ప్రత్యామ్నాయంగా చూడకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

సాధారణ ఎఫ్‌డీతో తేడా ఏంటి?
డబ్బు చాలా కాలం అవసరం ఉండదని ముందే తెలిసుంటే సాధారణ ఎఫ్‌డీ మంచి ఎంపిక కావచ్చు. తరచూ నగదు అవసరమయ్యే వారికి మాత్రం స్వీప్-ఇన్ ఎఫ్‌డీ మరింత సౌకర్యంగా ఉంటుంది. ఇది పెట్టుబడి పథకం కంటే నగదు నిర్వహణకు ఉపయోగపడే సాధనం. ప్రస్తుతం చాలా బ్యాంకుల్లో సేవింగ్స్‌ ఖాతాలకు సుమారు 2.5 నుంచి 2.75 శాతం వడ్డీ లభిస్తే, ఏడాది కాలపరిమితి ఉన్న ఎఫ్‌డీలపై సుమారు 6.25 నుంచి 6.60 శాతం వరకూ వడ్డీ లభిస్తోంది. పెద్ద మొత్తం ఎక్కువ రోజులు ఖాతాలోనే ఉంటే గణనీయమైన వడ్డీ ఆదాయం కోల్పోయే అవకాశం ఉంది.
Advertisement
Sweep in FD
Savings Account
Fixed Deposit
Interest Rates
Banking Services
Personal Finance

More Telugu News