విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ ప్రయాణం.. ఆసక్తికర విషయం చెప్పిన సచిన్ టెండూల్కర్

Virat Kohli fitness journey Sachin Tendulkar shares interesting facts
  • 2011 ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ ఫిట్‌నెస్ ప్రయాణం ప్రారంభం
  • ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న సచిన్ టెండూల్కర్
  • ఓసారి డిన్నర్ తర్వాత ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని కోహ్లీ నిర్ణయించుకున్నట్లు వెల్లడి
భారత క్రికెట్‌లో ఫిట్‌నెస్ విప్లవానికి ఆద్యుడు విరాట్ కోహ్లీ. కోహ్లీ సాగించిన ఈ అద్భుత ప్రయాణం ఎలా మొదలైందో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఒక సందర్భంలో గుర్తుచేసుకున్నాడు. 2011 ఆస్ట్రేలియా పర్యటనలో చోటుచేసుకున్న ఒక చిన్న సంఘటనే కోహ్లీ ఆలోచనా దృక్పథాన్ని సమూలంగా మార్చేసిందని పేర్కొన్నాడు.

2011లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సమయంలో, కాన్‌బెర్రాలోని ఒక థాయ్ రెస్టారెంట్‌‍లో సచిన్, కోహ్లీ కలిసి రాత్రి భోజనం చేశారు. డిన్నర్ ముగించుకుని హోటల్‌కు నడుచుకుంటూ వెళుతున్న క్రమంలో కోహ్లీ సచిన్‌తో "పాజీ, ఇక తిన్నది చాలు.. ఇప్పటి నుంచి ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలి" అని అన్నట్లు సచిన్ వెల్లడించాడు. 

ఈ ఆసక్తికరమైన జ్ఞాపకాన్ని సచిన్ టెండూల్కర్ 2022లో విరాట్ కోహ్లీ 100వ టెస్ట్ మ్యాచ్ సందర్భంలో బీసీసీఐ విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో పంచుకున్నారు. "ఆ రోజు సాయంత్రం నువ్వు నీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నావు. ఆ తర్వాత ఫిట్‌నెస్ సాధించడానికి నువ్వు పడని శ్రమ లేదు. మైదానంలో గణాంకాలు ఎలా ఉన్నా, యువతకు నువ్వు ఒక అద్భుతమైన రోల్ మోడల్‌గా నిలిచావు" అని సచిన్ కొనియాడారు.

అధికంగా భుజించిన తర్వాత కలిగే అసౌకర్యం లేదా నీరసం వంటి చిన్న అనుభవాలే కొన్నిసార్లు జీవనశైలిలో పెను మార్పులకు పునాది వేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అప్పుడప్పుడు పరిమితికి మించి ఆహారం తీసుకోవడం పెద్ద సమస్య కాదని, అయితే ఆ తర్వాత మనం క్రమం తప్పకుండా పాటించే ఆరోగ్యకరమైన అలవాట్లే ఫిట్‌నెస్‌ను నిర్ణయిస్తాయని డైటీషియన్లు వివరిస్తున్నారు. సమతుల్య ఆహారం, నిత్యం వ్యాయామం వంటి చిన్న మార్పులే దీర్ఘకాలంలో సత్ఫలితాలను ఇస్తాయి. అడపాదడపా చేసే విందుల కంటే, మన దైనందిన జీవనశైలి మాత్రమే ఆరోగ్యంపై అత్యధిక ప్రభావం చూపుతుందని వారు స్పష్టం చేస్తున్నారు.
Advertisement
Virat Kohli
Sachin Tendulkar
Indian Cricket Team
Fitness Journey
Australia Tour
BCCI

More Telugu News