టీటీడీ ఆసుపత్రుల్లో మందుల కొనుగోళ్లలో భారీ అవినీతి: లోకేశ్‌పై భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు
- ఏపీలో అవినీతి తీవ్ర స్థాయికి చేరిందన్న హూమన
- టీటీడీని కూడా వదలకుండా పీడిస్తున్నారని ఆరోపణ
- ఎల్1 టెండర్ల పేరుతో అక్రమాలకు తెరలేపారన్న భూమన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి తీవ్ర స్థాయికి చేరుకుందని వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఈ అవినీతిలో మంత్రి నారా లోకేశ్ పాత్ర స్పష్టంగా ఉందని ఆరోపించారు. తిరుపతిలోని ప్రసిద్ధ స్విమ్స్, బర్డ్స్ ఆసుపత్రుల్లో ప్రాణరక్షక మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు.
పవిత్రమైన ధార్మిక సంస్థ అయిన టీటీడీని కూడా వదిలిపెట్టకుండా ఇష్టమొచ్చినట్లు పట్టి పీడిస్తున్నారని ధ్వజమెత్తారు. శస్త్ర చికిత్సలకు అవసరమైన పరికరాల నుంచి పెద్ద పెద్ద యంత్రాల టెండర్ల వరకు తీవ్రస్థాయిలో గోల్‌మాల్ జరుగుతోందని విమర్శించారు. ఎల్1 టెండర్ల పేరుతో అక్రమాలకు తెరలేపారని, కంపెనీలతో ముందే లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుని, తక్కువ ధరకు లభించే పరికరాలను టీటీడీకి ఎక్కువ ధరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు.
మంత్రి నారా లోకేశ్ అమలు చేస్తున్న ‘రెడ్ బుక్’ రాజ్యాంగం వల్లే రాష్ట్రంలో హింస, అవినీతి కరాళ నృత్యం చేస్తున్నాయని భూమన విమర్శించారు. ప్రాణరక్షక మందుల కొనుగోళ్ల వెనుక ఉన్న ఈ దిగజారుడు కుట్రపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.