ప్రజలు ఎన్నుకున్న విరూపాక్షి ఏమైనా ఉగ్రవాదా?: జగన్

Jagan Mohan Reddy asks if elected MLA Virupakshi is a terrorist
  • రాష్ట్రంలో అరాచక పాలన పరాకాష్టకు చేరిందని జగన్ విమర్శ
  • ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ఉగ్రవాదిలా అరెస్ట్ చేశారని ఆగ్రహం
  • సీదిరి అప్పలరాజు, ముస్తఫాలపై అక్రమ కేసులు బనాయించారని ధ్వజం
  • ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చడానికే దాడులు, అరెస్టులని విమర్శ
  • ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసిన జగన్
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ‘నారాసుర పాలన’లో అరాచకం పరాకాష్ఠకు చేరిందని వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దాడి చేసిన అధికార పార్టీ వారికి రక్షణ కల్పిస్తూ, బాధితులైన ప్రతిపక్ష నేతలపైనే హత్యాయత్నం వంటి తీవ్రమైన కేసులు బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యమా, పోలీస్ రాజ్యమా లేక జంగిల్ రాజ్యమా అని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు.

ఆలూరు బీసీ ఎమ్మెల్యే విరూపాక్షిని అర్ధరాత్రి అరెస్ట్ చేసిన తీరుపై జగన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. "ప్రజలెన్నుకున్న ఎమ్మెల్యే విరూపాక్షి ఏమైనా ఉగ్రవాదా? అర్ధరాత్రి 2:45 గంటలకు వందలాది పోలీసులతో ఇంటిపై దాడి చేసి, తలుపులు బద్దలుకొట్టి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?" అని జగన్ నిలదీశారు. 

చిప్పగిరి మండలం నేమకల్లులో టీడీపీ శ్రేణులు తమ పార్టీ నాయకుడి ఇంటిపై దాడి చేయగా, ప్రాణభయంతో ఆ కార్యకర్త ఎమ్మెల్యేకు ఫోన్ చేశాడని జగన్ వివరించారు. బాధితుడికి అండగా నిలబడటానికి వెళ్లిన ఎమ్మెల్యేపైనే టీడీపీ వారు రాళ్లతో దాడి చేశారని, ఈ ఘటనలో ఆయన సోదరుడు గాయపడ్డాడని తెలిపారు. వాస్తవానికి దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాల్సింది పోయి, బాధితుడైన ఎమ్మెల్యేపైనే హత్యాయత్నం కేసు నమోదు చేయడం దారుణమని అన్నారు. అర్ధరాత్రి పోలీసులు జరిపిన దౌర్జన్యం బయటకు రాకూడదనే భయంతోనే ఎమ్మెల్యే ఇంట్లోని సీసీటీవీ హార్డ్‌డిస్క్‌లను తీసుకెళ్లారని, సాక్ష్యాలను కాపాడాల్సిన పోలీసులతోనే సాక్ష్యాలను మాయం చేయిస్తున్నారని జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇదే తరహా రాజకీయ కక్ష సాధింపు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోందని జగన్ విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా మార్చి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే షేక్ మహ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడిపై కూడా వ్యాపార వివాదాన్ని అడ్డుపెట్టుకుని కిడ్నాప్ కేసు బనాయించారని, పోలీసులకు అప్పగించిన వ్యక్తిని కిడ్నాప్ చేశారని కేసు పెట్టడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు.

ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ అక్రమ అరెస్టులు, దాడులకు పాల్పడుతున్నారని జగన్ అన్నారు. డీఎస్సీ-2025 అక్రమాలపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని, విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు. విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.9,500 కోట్ల విద్యా, వసతి దీవెన బకాయిలు, నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.3 వేల భృతి హామీ ఏమైందని నిలదీశారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడుతోందన్నారు. 

"అధికారం, పోలీసు బలం శాశ్వతం కాదు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అర్ధరాత్రి అరెస్టులు చేసినా వైసీపీ వెనక్కి తగ్గదు. బాధితులకు అండగా నిలుస్తూ అరాచక పాలనపై పోరాటం కొనసాగిస్తాం" అని జగన్ స్పష్టం చేశారు.
Advertisement
Jagan Mohan Reddy
MLA Virupakshi Arrest
Chandrababu Naidu
Andhra Pradesh Politics
YSRCP vs TDP
Political Vendetta

More Telugu News