నా లక్ష్యం అది కాదు.. ఇప్పుడు కేవ‌లం దాని కోస‌మే ఆడుతున్నా: భువనేశ్వర్ కుమార్

Bhuvneshwar Kumar says returning to Team India is not his goal and credits two people for pace bowling growth
  • టీమిండియాలోకి పునరాగమనం త‌న‌ లక్ష్యం కాద‌న్న భువీ
  • కేవలం ఆటపై ఉన్న ఇష్టంతోనే క్రికెట్ ఆడుతున్నట్లు వెల్ల‌డి
  • జట్టులో లేనందుకు ఎలాంటి పశ్చాత్తాపం లేద‌న్న పేస‌ర్‌
  • భారత పేస్ బౌలింగ్ ఎదుగుదలకు కోహ్లీ, ర‌విశాస్త్రి కారణమ‌ని వ్యాఖ్య‌
టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన కెరీర్, భవిష్యత్తు ప్రణాళికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జాతీయ జట్టులోకి తిరిగి రావాలన్నదే ఇప్పుడు తన ప్రధాన లక్ష్యం కాదని, కేవలం ఆటపై ఉన్న ప్రేమతోనే క్రికెట్ కొనసాగిస్తున్నానని స్పష్టం చేశాడు. భారత జట్టుకు దూరమైన జీవితంతో తాను సంతృప్తిగా ఉన్నానని, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆటను ఆస్వాదిస్తున్నానని తెలిపాడు.

36 ఏళ్ల భువనేశ్వర్ చివరిసారిగా 2022లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకు 21 టెస్టులు, 121 వన్డేలు, 87 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తరఫున ఆడి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా ఆర్‌సీబీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. "దేశం తరఫున ఆడాలన్న నా కల ఇప్పటికే నెరవేరింది. ఇప్పుడు మళ్లీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మళ్లీ అవకాశం వస్తే గొప్ప విషయమే. కానీ, దానికోసం ఒత్తిడికి గురికావడం లేదు. ప్రస్తుతం నేను ఆడుతున్నది కేవలం ఆటపై ఉన్న ఇష్టం, క్రమశిక్షణతోనే" అని వివరించాడు. ఐపీఎల్, దేశవాళీ క్రికెట్, యూపీ టీ20 లీగ్‌లలో ఆడుతూ ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటున్నట్లు తెలిపాడు.

జట్టులో చోటు కోల్పోయినందుకు తనకెలాంటి పశ్చాత్తాపం లేదని, ఈ విషయంలో తన కుటుంబం అందించిన మద్దతు ఎంతో కీలకమని భువీ పేర్కొన్నాడు. "ఇంట్లో మేము క్రికెట్ గురించి అస్సలు మాట్లాడుకోము. జట్టులో నా స్థానం గురించి, నన్ను ఎందుకు ఎంపిక చేయలేదనే చర్చలు ఉండవు. క్రీడల్లో తరాల మార్పు సహజమని నేను అర్థం చేసుకున్నాను. ఈ పరిస్థితిని ఎదుర్కొన్న మొదటి ఆటగాడిని నేను కాదు, చివరివాడినీ కాను. అందుకే నేను ఉన్న స్థితిలో సంతోషంగా ఉన్నాను" అని అన్నాడు.

భారత్‌లో ఫాస్ట్ బౌలింగ్ విప్లవానికి ఐపీఎల్‌తో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కోచ్ రవిశాస్త్రిలే కారణమని భువనేశ్వర్ ప్రశంసించాడు. "భారత పేస్ దళాన్ని నిర్మించాలనే స్పష్టమైన విజన్‌తో కోహ్లీ, శాస్త్రి పనిచేశారు. విదేశీ పర్యటనలకు ముందు స్వదేశంలో కూడా పేసర్లకు అనుకూలించే పిచ్‌లను తయారు చేయించి మమ్మల్ని సిద్ధం చేశారు. అలాంటి చిన్న నిర్ణయాలే పెద్ద మార్పులకు కారణమయ్యాయి" అని గుర్తుచేసుకున్నాడు. తన చిన్నతనంలో మీరట్‌లోని అకాడమీలో సీనియర్ అయిన ప్రవీణ్ కుమార్ బౌలింగ్‌ను చూసి ఎంతో నేర్చుకున్నానని, అతని బౌలింగ్ శైలి తనపై చాలా ప్రభావం చూపిందని భువనేశ్వర్ చెప్పుకొచ్చాడు.
Advertisement
Bhuvneshwar Kumar
Team India
Virat Kohli
Ravi Shastri
Royal Challengers Bengaluru
Indian Pace Bowling

More Telugu News