కెప్టెన్‌గా తిలక్ వర్మ.. దులీప్ ట్రోఫీకి సౌత్ జోన్ జట్టు ఇదే!

Tilak Varma as Captain South Zone squad for Duleep Trophy announced
  • దులీప్ ట్రోఫీకి సౌత్ జోన్ కెప్టెన్‌గా తిలక్ వర్మ ఎంపిక
  • ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు
  • గత రంజీ సీజన్ టాప్ స్కోరర్ స్మరణ్, కరుణ్ నాయర్‌కు జట్టులో చోటు
  • గతేడాది ఫైనలిస్ట్ కావడంతో నేరుగా సెమీఫైనల్‌కు అర్హత
  • ఈ నెల‌ 23 నుంచి బెంగళూరు వేదికగా ఈ టోర్నమెంట్ ప్రారంభం
దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీ కోసం సౌత్ జోన్ తమ జట్టును ప్రకటించింది. భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్, హైదరాబాద్ యువ సంచలనం తిలక్ వర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఆంధ్ర జట్టుకు చెందిన సీనియర్ బ్యాటర్ రికీ భుయ్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 10 వరకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) వేదికగా ఈ టోర్నమెంట్ జరగనుంది.

నేడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కార్యదర్శి సానా సతీశ్‌ బాబు నేతృత్వంలో సెలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఆంధ్ర మాజీ రంజీ ఆటగాడు ఆర్వీ చంద్రమౌళి ప్రసాద్ ఈ సెలక్షన్ ప్యానెల్‌కు ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఈ సమావేశంలో సౌత్ జోన్‌లోని ఏడు సభ్య సంఘాలైన ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్, గోవా, పాండిచ్చేరి, కేరళ ప్రతినిధులు పాల్గొన్నారు. జట్టుకు హెడ్ కోచ్‌గా ఆంధ్రకు చెందిన అనుభవజ్ఞుడైన లెవల్ 2 కోచ్ ఎంఎన్ విక్రమ్ వర్మను నియమించారు.

15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో యువత, అనుభవం చక్కగా మేళవించారు. భారత జట్టుకు ఆడిన వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్‌కు చోటు దక్కింది. 2025/26 రంజీ ట్రోఫీ సీజన్‌లో 950 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన కర్ణాటక యువ ఆటగాడు ఆర్. స్మరణ్, హైదరాబాద్‌కు చెందిన కె. హిమతేజ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లను ఎంపిక చేశారు. ఇటీవలే జింబాబ్వేపై 3-0తో టీ20 సిరీస్ గెలిచిన భారత జట్టులో తిలక్ వర్మ సభ్యుడిగా ఉన్నాడు.

శ్రీలంక 'ఎ'తో సిరీస్ గెలిచిన భారత 'ఎ' జట్టులో సభ్యులుగా ఉన్న షేక్ రషీద్ (ఆంధ్ర), ఎన్. జగదీశన్ (తమిళనాడు) కూడా ఈ జట్టులో ఉన్నారు. వికెట్ కీపింగ్ బాధ్యతలను జగదీశన్ నిర్వర్తించనున్నాడు. గోవా బ్యాటర్ అభినవ్ తేజ్రానా కూడా జట్టులో స్థానం సంపాదించాడు.

గత ఎడిషన్‌లో సౌత్ జోన్ ఫైనల్‌కు చేరి సెంట్రల్ జోన్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా ఈసారి నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఆగస్టు 30న బీసీసీఐ సీఓఈ గ్రౌండ్ 2లో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌లో క్వార్టర్‌ఫైనల్ 2 విజేతతో సౌత్ జోన్ తలపడుతుంది.

బౌలింగ్ విభాగం కూడా పటిష్ఠంగా ఉంది. స్పిన్ బాధ్యతలను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్, లెగ్ స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్ పంచుకోనున్నారు. పేస్ విభాగంలో కె. సాయితేజ, త్రిపురాన విజయ్, విద్వత్ కావరప్ప, ఎం.డి. నిదీశ్‌ ఉన్నారు.

సౌత్ జోన్ జట్టు:
ఎన్. తిలక్ వర్మ (కెప్టెన్), రికీ భుయ్ (వైస్ కెప్టెన్), అభినవ్ తేజ్రానా, షేక్ రషీద్, కె.ఎం. హిమతేజ, ఆర్. స్మరణ్, ఎన్. జగదీశన్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, తనయ్ త్యాగరాజన్, శ్రేయస్ గోపాల్, కె. సాయితేజ, టి. విజయ్, విద్వత్ కావరప్ప, హెచ్. అమన్ ఖాన్, ఎం.డి. నిదీశ్‌.
Advertisement
Tilak Varma
Duleep Trophy South Zone Squad
Ricky Bhui
BCCI Domestic Cricket
South Zone Cricket Team
Bengaluru Duleep Trophy

More Telugu News