భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టును ఐదేళ్లు ఆపింది జగనే!: పెమ్మసాని ఫైర్

Pemmasani Chandra Sekhar says Jagan stopped Bhogapuram Airport project for five years
  • భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్‌పై వైసీపీ వాదనలను తీవ్రంగా ఖండించిన కేంద్రమంత్రి పెమ్మసాని
  • కోర్టు కేసులతో ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసింది జగనేనని ఆరోపణ
  • ఐదేళ్ల పాలనలో కనీసం ఒక్క కనెక్టివిటీ రోడ్డు కూడా వేయలేదని విమర్శ
  • కూటమి ప్రభుత్వం వచ్చాకే పనులు వేగవంతం చేసి ప్రాజెక్టును పూర్తి చేశామని స్పష్టీకరణ
  • రీ-టెండరింగ్ డ్రామాతో కాలయాపన చేసి, ఉత్తరాంధ్ర యువత ఉపాధిని దెబ్బతీశారని ఫైర్
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఘనత తమదేనంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్రంగా ఖండించారు. ఆ ప్రాజెక్టును నిర్మించడం కాదు కదా, ఐదేళ్ల పాటు ఉద్దేశపూర్వకంగా అడ్డుకొని, కాలయాపన చేసి, ఉత్తరాంధ్ర అభివృద్ధిని దెబ్బతీసిన పాపం పూర్తిగా జగన్ ప్రభుత్వానిదేనని ఆయన ఘాటుగా విమర్శించారు. భోగాపురం ప్రాజెక్టు వెనుక ఉన్న వాస్తవాలను ఆయన మీడియా సమావేశంలో వివరించారు. ఈ ప్రాజెక్టు ఆలోచన దగ్గరి నుంచి పూర్తి చేసే వరకు టీడీపీ, కూటమి ప్రభుత్వాలదే కీలక పాత్ర అని, ఇందులో వైసీపీ క్రెడిట్ ఏమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు.

దార్శనికత టీడీపీది.. అడ్డంకులు వైసీపీవి 
విభజిత ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ తరహాలో ఒక ప్రపంచ స్థాయి అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమని 2015లోనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు బలంగా ఆకాంక్షించారని పెమ్మసాని గుర్తుచేశారు. కేవలం ప్రయాణికుల కోసమే కాకుండా, లాజిస్టిక్స్, ఏవియేషన్ హబ్‌గా ఉత్తరాంధ్రను తీర్చిదిద్దాలనే భారీ లక్ష్యంతో 2700 ఎకరాల్లో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారన్నారు. ప్రభుత్వం నిర్వహించిన బిడ్డింగ్‌లో జీఎంఆర్ సంస్థ ముందుకొచ్చిందని, ఆ ప్రాంతంపై అభిమానంతో, చంద్రబాబుపై గౌరవంతో వారు ఈ బృహత్కార్యానికి సిద్ధపడ్డారని తెలిపారు. 

2019 నాటికి టీడీపీ ప్రభుత్వం 2200 ఎకరాల భూసేకరణ పూర్తి చేసిందని, అయితే మిగిలిన 500 ఎకరాల సేకరణకు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగనే అడ్డుపడ్డారని పెమ్మసాని సంచలన ఆరోపణలు చేశారు. "ఆయన తన అనుచరులతో రైతులను రెచ్చగొట్టి, కీలకమైన రన్‌వే ప్రాంతంలో భూములకు సంబంధించి కోర్టుల్లో కేసులు వేయించారు. దీనివల్ల ప్రాజెక్టు ముందుకు సాగకుండా ఆగిపోయింది" అని ఆయన వివరించారు.

ఐదేళ్లలో జగన్ చేసిందేంటి?
 2019లో అధికారంలోకి వచ్చాక, జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వేగవంతం చేయడానికి బదులు, మరింత జాప్యం చేసిందని పెమ్మసాని విమర్శించారు. తానే అడ్డుకున్న 500 ఎకరాల్లో కేవలం 300 ఎకరాలను, అదీ తన అనుచరులకు ఎక్కువ నష్టపరిహారం వచ్చేలా "మేనేజ్" చేసి సేకరించారని, నిజమైన రైతులకు న్యాయం జరగలేదని ఆరోపించారు. 

పోలవరం ప్రాజెక్టును రీ-టెండరింగ్ పేరుతో ఎలాగైతే నిర్వీర్యం చేయాలని చూశారో, అదే తరహాలో భోగాపురంలోనూ అవినీతి జరిగిపోయిందంటూ రీ-టెండరింగ్ డ్రామాకు తెరలేపారన్నారు. అయితే, అంతర్జాతీయ టెండర్లలో మళ్లీ జీఎంఆర్ సంస్థే నంబర్ వన్‌గా నిలిచిందని, పాత షరతులతోనే ఒప్పందం కుదిరిందని, ఈ ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం సాధించింది కేవలం ప్రాజెక్టును ఆలస్యం చేయడమేనని ఎద్దేవా చేశారు.

ఉత్తరాంధ్ర యువతకు తీరని నష్టం 
ఈ ప్రాజెక్టు గనుక మూడేళ్ల క్రితమే పూర్తయి ఉంటే, ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,000 మందికి పైగా యువతకు ఉద్యోగాలు లభించేవని పెమ్మసాని ఆవేదన వ్యక్తం చేశారు. "నెలకు రూ.20,000 జీతంతో ఒక్కొక్కరు ఐదేళ్లలో రూ.10 లక్షల ఆదాయం కోల్పోయారు. ఎకరాకు అదనంగా రెండు లక్షలు వస్తాయని ఆశ చూపి, వారి జీవితాల్లో రూ.10 లక్షలు నష్టం చేసిన పాపం జగన్‌ది కాదా? ఇది వాస్తవం కాదంటే దమ్ముంటే చర్చకు రావాలి" అని ఆయన సవాల్ విసిరారు.

కూటమి వచ్చాకే వేగం 
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారని పెమ్మసాని తెలిపారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దాదాపు 10 సార్లు క్షేత్రస్థాయిలో పర్యటించి, సమీక్షలు జరిపి మిగిలిన అడ్డంకులను తొలగించారన్నారు. 

కనెక్టివిటీయే లేని ఎయిర్‌పోర్ట్‌ను హడావుడిగా ప్రారంభించారని వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ.. "ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి ఒక్కటంటే ఒక్క రోడ్డు వేశారా? మీరేమీ చేయకుండా ఇప్పుడు విమర్శిస్తారా? మేము వచ్చిన వెంటనే యుద్ధప్రాతిపదికన 5 రోడ్ల నిర్మాణం చేపట్టాం. మిగిలిన రెండు కూడా త్వరలోనే పూర్తి చేస్తాం" అని ఆయన స్పష్టం చేశారు. 

ప్రారంభంలో ప్రజలకు కొంత అసౌకర్యం ఉన్నప్పటికీ, భవిష్యత్తులో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ తరహాలో భోగాపురం చుట్టూ అద్భుతమైన ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందుతుందని, ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద భోగాపురం ప్రాజెక్టు కూటమి ప్రభుత్వ దార్శనికతకు, పట్టుదలకు నిదర్శనమని, వైసీపీ పాత్ర కేవలం విధ్వంసం, కాలయాపన మాత్రమేనని పెమ్మసాని తేల్చిచెప్పారు.
Advertisement
Pemmasani Chandra Sekhar
Bhogapuram International Airport
Jagan Mohan Reddy
Chandrababu Naidu
Andhra Pradesh Infrastructure
North Andhra Development

More Telugu News