డ్రైవర్ల నుంచి సినిమాటోగ్రాఫర్ల వరకు.. చైనాలో ఏఐ దెబ్బకు ఉద్యోగాలు గల్లంతు!

China AI impact on jobs from drivers to cinematographers
  • చైనాలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)
  • ట్యాక్సీ డ్రైవర్లు, వైట్ కాలర్ ఉద్యోగుల ఉపాధిపై తీవ్ర ప్రభావం
  • ఇప్పటికే బలహీనంగా ఉన్న జాబ్ మార్కెట్‌పై మరింత ఒత్తిడి
  • ఉద్యోగ నష్టాలను ఏఐ భర్తీ చేస్తుందన్న చైనా అధ్యక్షుడి వ్యాఖ్యలు
  • ప్రభుత్వ చర్యలు ఆలస్యమవుతాయనే ఆందోళనలో లక్షలాది కార్మికులు
చైనాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విస్తరణ అత్యంత వేగంగా జరుగుతుండటం, ఇప్పటికే బలహీనంగా ఉన్న కార్మిక మార్కెట్‌లో తీవ్ర ఆందోళనలకు కారణమవుతోంది. ఏఐ ఆధారిత సాంకేతికత వల్ల లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్నాయని, ఇది నిరుద్యోగ సంక్షోభానికి దారితీయవచ్చని గార్డియన్ పత్రికలో పాత్రికేయురాలు అమీ హాకిన్స్ తన కథనంలో హైలైట్ చేశారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఈ భయాలను మరింత బలపరుస్తున్నాయి.

వుహాన్ నగరంలో డ్రైవర్‌లెస్ ట్యాక్సీలను ప్రవేశపెట్టడంతో చాలా మంది ట్యాక్సీ డ్రైవర్లు ఒక్కసారిగా తమ ఉపాధిని కోల్పోయారు. అయితే, ఆ తర్వాత కొన్ని డ్రైవర్‌లెస్ కార్లు ఆకస్మికంగా రోడ్లపై నిలిచిపోయి ట్రాఫిక్ జామ్‌లకు కారణమవడంతో, వాటిని పరిశీలన కోసం తాత్కాలికంగా ఉపసంహరించారు. దీంతో డ్రైవర్లు మళ్లీ విధుల్లో చేరారు. ఈ ఘటన ఏఐ వల్ల ఎదురయ్యే ముప్పును కళ్లకు కట్టినట్టు చూపించింది. ఇది కేవలం డ్రైవర్లకే పరిమితం కాలేదు. ఏఐని ప్రవేశపెట్టడం కోసం వైట్ కాలర్ ఉద్యోగులను తొలగించిన సంస్థలు, కోర్టు తీర్పుల ప్రకారం వారికి నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది.

చైనాలో ఇప్పటికే నిరుద్యోగం అధిక స్థాయిలో ఉండగా, రియల్ ఎస్టేట్, విద్య వంటి రంగాలు మాంద్యంలోకి జారుకోవడంతో కోట్లాది మంది ఫార్మల్ ఉద్యోగాలను వదిలి గిగ్ ఎకానమీ (తాత్కాలిక పనులు) వైపు మళ్లుతున్నారు. ఒక థింక్‌ట్యాంక్ అంచనా ప్రకారం, 2019లో 160 మిలియన్లుగా ఉన్న గిగ్ వర్కర్ల సంఖ్య, ఈ ఏడాదికి 320 మిలియన్లకు (సుమారు 44 శాతం కార్మిక శక్తి) పెరుగుతుందని అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో రైడ్-హెయిలింగ్ యాప్‌లపై ఆధారపడిన వారి ఉపాధికి ఇప్పుడు రోబోట్యాక్సీల రూపంలో గండి పడుతోంది.

ఈ సమస్య సృజనాత్మక రంగాలనూ వదలడం లేదు. బీజింగ్‌లో 20 ఏళ్లుగా సినిమా పరిశ్రమలో పనిచేస్తున్న సినిమాటోగ్రాఫర్ టియాన్ జెమిన్, తన ఉద్యోగాన్ని ఏఐ సాఫ్ట్‌వేర్ వల్ల కోల్పోయారు. "ఆరేళ్ల కఠోర శ్రమ తర్వాత సినిమాటోగ్రాఫర్‌గా ఎదిగితే, ఇప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ నా స్థానాన్ని భర్తీ చేసింది" అని ఆయన సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు.

గత జులైలో జరిగిన ప్రపంచ ఏఐ సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మాట్లాడుతూ... ఏఐ అనేది అందరి శ్రేయస్సు, భద్రతకు చోదకశక్తిగా ఉండాలని ఆకాంక్షించారు. 

ప్రైవేట్ రంగంపై ప్రభుత్వానికి గట్టి పట్టున్న చైనా, ఏఐ వల్ల కలిగే ఉద్యోగ నష్టాలను నివారించడానికి కంపెనీలకు నియామక కోటాలు విధించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ప్రభుత్వం తీసుకునే ఈ రక్షణ చర్యలు క్షేత్రస్థాయిలో ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోతున్న వారిని కాపాడటానికి సమయానికి అందకపోవచ్చనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
Advertisement
China
Artificial Intelligence
AI job displacement
Wuhan Robotaxis
Xi Jinping
China labor market

More Telugu News