మేం ఎవరికి ఏం అమ్మాలో ఎవరూ చెప్పనక్కర్లేదు: టర్కీకి ఎఫ్-35 విమానాల విక్రయంపై నెతన్యాహుకు ట్రంప్ షాక్
- టర్కీకి ఎఫ్-35 ఫైటర్ జెట్లను విక్రయించడంపై నెతన్యాహు అభ్యంతరం
- టర్కీ తమకు నమ్మకమైన భాగస్వామి అన్న ట్రంప్
- తన విషయంలో టర్కీ నమ్మకంగా వ్యవహరించిందని వ్యాఖ్య
టర్కీకి ఎఫ్-35 ఫైటర్ జెట్లను విక్రయించడంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యక్తం చేసిన అభ్యంతరాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా తోసిపుచ్చారు. తాము ఎవరికి ఏ ఆయుధాలు అమ్మాలో ఎవరూ తమకు చెప్పాల్సిన అవసరం లేదని ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇజ్రాయెల్ ప్రధానితో భేటీకి ముందు రోజు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం అంతర్జాతీయంగా తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. టర్కీ ప్రెసిడెంట్ రెజెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌ను తన మంచి మిత్రుడిగా అభివర్ణించిన ట్రంప్... టర్కీ తమకు అత్యంత విలువైన, నమ్మకమైన భాగస్వామి అని కొనియాడారు.
అంతకుముందు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, టర్కీ తీవ్రవాద భావజాలంతో కూడిన పాలనలో ఉందని, అలాంటి దేశానికి ఎఫ్-35 యుద్ధ విమానాలను విక్రయిస్తే పశ్చిమాసియాలో సైనిక సమతుల్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ విమర్శలకు ట్రంప్ ఘాటుగా స్పందిస్తూ, ఇజ్రాయెల్‌కు టర్కీపై మంచి అభిప్రాయం లేకపోవచ్చు కానీ తన విషయంలో మాత్రం టర్కీ ఎంతో నమ్మకంగా వ్యవహరించిందని స్పష్టం చేశారు.