స్కాట్లాండ్‌లో 'ఫిరంగి' పేరుతో చిక్కులు.. ట్యాగ్‌లైన్‌తో గట్టెక్కిన భారత సంతతి వ్యక్తి

Indian origin man overcomes Firangi restaurant name trouble in Scotland with a tagline
  • స్కాట్లాండ్‌లో 'ఫిరంగి' పేరుతో రెస్టారెంట్ పెట్టిన భారతీయుడు
  • జాతి వివక్ష పదం అంటూ కోర్టు నుంచి అభ్యంతరం
  • ట్యాగ్‌లైన్‌ జోడించి న్యాయపరమైన చిక్కుల నుంచి గట్టెక్కిన యజమాని
  • స్కాటిష్ రాజకీయాల్లోనూ చురుగ్గా ఉన్న రెస్టారెంట్ ఓనర్ అనిల్ సింగ్
స్కాట్లాండ్‌లో ఓ భారతీయ రెస్టారెంట్‌కు 'ఫిరంగి' అని పేరు పెట్టడం అనూహ్యమైన న్యాయపోరాటానికి దారితీసింది. గ్లాస్గో నగరంలో రెస్టారెంట్ నడుపుతున్న, స్కాటిష్ నేషనల్ పార్టీ (SNP) సీనియర్ సభ్యుడైన అనిల్ సింగ్‌కు ఈ విచిత్రమైన అనుభవం ఎదురైంది. తన రెస్టారెంట్ పేరు కారణంగా ఆయన కోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళితే, అనిల్ సింగ్ తన ఇండియన్ రెస్టారెంట్‌కు 'ఫిరంగి' అని పేరు పెట్టారు. ప్రారంభమైన కొద్ది వారాలకే, అంటే సుమారు నెలన్నర తర్వాత, ఆ పేరును కొనసాగించలేరంటూ ఆయనకు కోర్టు నుంచి నోటీసులు అందాయి. 'ఫిరంగి' అనే పదం శ్వేతజాతీయులను కించపరిచేలా, జాతి వివక్షాపూరితంగా ఉందని స్థానిక అధికారులు భావించారు. దీంతో రెస్టారెంట్ పేరుపై న్యాయపరమైన విచారణ మొదలైంది.

ఈ సమస్యకు ఒక చిన్న ట్యాగ్‌లైన్‌తో పరిష్కారం లభించింది. తన రెస్టారెంట్ పేరు కింద "ఫిరంగి, యెట్ ఇండియన్ బై నేచర్" (Firangi, Yet Indian By Nature) అనే ట్యాగ్‌లైన్‌ను అనిల్ జోడించారు. "ఇండియన్ బై నేచర్" అనే ట్రేడ్‌మార్క్ అప్పటికే ఆయన వద్ద ఉండటంతో, న్యాయవాది సలహా మేరకు ఈ మార్పు చేశారు. ఇది తమది భారతీయ రెస్టారెంట్ అని స్పష్టం చేయడమే కాకుండా, న్యాయపరమైన రక్షణ కూడా కల్పించింది.

ఈ సందర్భంగా అనిల్ సింగ్ మాట్లాడుతూ, "భారత్‌లో విదేశీయులను సూచించడానికి శతాబ్దాలుగా 'ఫిరంగి' అనే పదాన్ని వాడుతున్నారు. అది ఎప్పుడూ అవమానకరమైన పదం కాదు. కానీ ఇక్కడ దాన్ని పూర్తిగా భిన్నమైన సాంస్కృతిక కోణంలో చూశారు. 'ఫిరంగి' అనే పదాన్ని భారత్ లో తెల్లజాతి వాళ్లను వివక్షాపూరితంగా పిలిచే పదంగా భావిస్తున్నారు" అని వివరించారు. ఈ ఘటనతో వేర్వేరు సంస్కృతులలో పదాలకు ఎంత భిన్నమైన అర్థాలు ఉంటాయో తెలిసివచ్చిందని ఆయన అన్నారు.

అనిల్ సింగ్ వ్యాపారంతో పాటు స్కాటిష్ రాజకీయాల్లోనూ చురుగ్గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన SNP రెన్‌ఫ్రూ బ్రాంచ్‌లో సెకండ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. రాబోయే కౌన్సిలర్ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. స్కాట్లాండ్‌లో పెరుగుతున్న ప్రవాస భారతీయులు, బలపడుతున్న భారత్-స్కాట్లాండ్ సంబంధాలు తనలాంటి వ్యాపారులకు కొత్త అవకాశాలు కల్పిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. భారత క్రీడాకారుల వంటి నిజమైన హీరోలకు తన రెస్టారెంట్‌లో ఆతిథ్యం ఇవ్వడం గర్వంగా ఉందని అనిల్ పేర్కొన్నారు.
Advertisement
Anil Singh
Firangi Restaurant Glasgow
Scottish National Party
Scotland Indian restaurant controversy
Firangi Yet Indian By Nature
Indian diaspora Scotland news

More Telugu News