Advertisement

ఇది ప్రజాస్వామ్య విజయం: కేంద్ర మంత్రి రాజీనామాపై సోనమ్ వాంగ్‌చుక్

Sonam Wangchuk reacts to Dharmendra Pradhan resigning as Education Minister
  • వీధుల నుంచి పోరాడి సాధించుకున్న ఫలితమన్న వాంగ్‌చుక్‌
  • భయం వీడి గళమెత్తిన పౌరులకు, దేశ యువతకు అభినందనలు
  • బాధ్యతాయుత పాలన దాటి విద్యారంగ సంస్కరణల వైపు సాగాలని పిలుపు
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ‘ప్రజాస్వామ్య విజయం’గా సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ అభివర్ణించారు. వీధుల నుంచి పోరాడి సాధించుకున్న ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఇది నిదర్శనమని చెప్పారు. శనివారం ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన వెంటనే వాంగ్‌చుక్ ‘ఎక్స్’ వేదికగా ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

శాంతి, ఓపిక, పట్టుదలకు దక్కిన ప్రతిఫలమిదని వాంగ్‌చుక్ ఆనందం వ్యక్తం చేశారు. ‘‘దేశంలోని ప్రతీ మూల నుంచి భయాన్ని వీడి, గళమెత్తిన పౌరులకు, జెన్‌-జీ యువతకు, సీజేపీకి నా అభినందనలు. బాధ్యతాయుత పాలన డిమాండ్ నుంచి మొదలైన ఈ పోరాటం, ఇప్పుడు విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణల దిశగా అడుగులు వేయాలి’’ అని పేర్కొన్నారు. పరీక్షల అక్రమాలు, ప్రశ్న పత్రాల లీక్‌లపై చర్యలు తీసుకోవాలని, ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ వాంగ్‌చుక్ 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు, గత 10 రోజులుగా దేశంలో చోటుచేసుకున్న పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, పరీక్షల వివాదాన్ని దేశ వ్యతిరేక శక్తులు వాడుకోకుండా చూడటానికే తప్పుకుంటున్నానని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన రాజీనామా లేఖను పంపారు. విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల విశ్వసనీయత కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ పరిణామంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. ప్రజలు ఐక్యంగా ప్రశ్నిస్తే ఎంతటి ప్రభుత్వమైనా దిగిరాక తప్పదని విద్యార్థి నాయకులు వ్యాఖ్యానించారు.
Advertisement
Sonam Wangchuk
Dharmendra Pradhan resignation
Education Minister paper leak
Victory for democracy
Jantar Mantar protests
Gen Z student movement

More Telugu News