Advertisement

ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అధికారులకు తలసాని కీలక సూచనలు

Ujjaini Mahankali Bonalu Talasani key instructions to officials
  • ఆగస్టు 2న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు
  • వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన తలసాని శ్రీనివాస్
  • పోలీసుల పాత్ర అత్యంత కీలకమన్న తలసాని

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని బీఆర్ఎస్ నేత, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. ఆగస్టు 2న జరగనున్న బోనాల ఉత్సవాల నిర్వహణపై ఆలయ ప్రాంగణంలో ఈరోజు వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకుముందు ఆలయ పరిసరాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.


ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ... అమ్మవారి దర్శనం, బోనాల సమర్పణ కోసం రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటంలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని, శాంతిభద్రతల పరిరక్షణకు అదనపు బలగాలను మోహరించడంతో పాటు అత్యాధునిక సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. ఆగస్టు 2న బోనాలు, ఆగస్టు 3న సాయంత్రం జరిగే ఫలహార బండ్ల ఊరేగింపు పూర్తయ్యే వరకు ట్రాఫిక్ డైవర్షన్లు సమర్థవంతంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. అలాగే వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.


ఇదిలా ఉండగా, జాతర సందర్భంగా మహంకాళి అమ్మవారికి సమర్పించే ప్రత్యేక చీర తయారీ పనులను తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆలయంలో పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, లా అండ్ ఆర్డర్ ఏసీపీ శ్రీధర్, జోనల్ కమిషనర్ మంగతాయారు, హెల్త్ ఆఫీసర్ వర్షితతో పాటు వివిధ శాఖల అధికారులు, ఆర్య సమాజ్, డెక్కన్ మానవ సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Talasani Srinivas Yadav
Ujjaini Mahankali Bonalu
Secunderabad Bonalu arrangements
Mahankali Temple Secunderabad
Telangana Bonalu festival
Secunderabad Bonalu 2024

More Telugu News