Advertisement

షమీని జీరో చేశారు.. బుమ్రా లేకపోతే కప్ గెలవలేం: శ్రీకాంత్

Krishnamachari Srikkanth says Shami made a nobody and India needs Bumrah to win World Cup
  • సీనియర్ పేసర్ మహమ్మద్ షమీని విస్మరించడంపై శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి
  • బుమ్రా ఉంటేనే భారత్‌కు ప్రపంచకప్ గెలిచే అవకాశం ఉందని వ్యాఖ్య
  • వన్డే ఫార్మాట్‌కు యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ సరిపోడన్న మాజీ కెప్టెన్
  • ప్రపంచకప్ దృష్ట్యా బుమ్రా వర్క్‌లోడ్ నిర్వహణ అత్యంత కీలకమని సూచన
టీమిండియా మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ కృష్ణమాచారి శ్రీకాంత్.. భారత జట్టు బౌలింగ్ వనరులపై, 2027 ప్రపంచకప్ సన్నాహకాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీని జట్టు యాజమాన్యం పూర్తిగా విస్మరించడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. గత ప్రపంచకప్‌లో హీరోగా నిలిచిన ఆటగాడిని ఇప్పుడు అనామకుడిగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.

స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఒక చర్చా కార్యక్రమంలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. "2023 ప్రపంచకప్‌లో 24 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన ఆటగాడు మహమ్మద్ షమీ. అలాంటి అద్భుతమైన బౌలర్‌ను యాజమాన్యం ఇప్పుడు పూర్తిగా పక్కనపెట్టడం నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. అతడిని ఒక రకంగా ఎవరూ పట్టించుకోని వ్యక్తిగా (నోబడీ) మార్చేశారు" అని అన్నాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత షమీ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదని, దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్నా అతనికి అవకాశం ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నాడు.

అదే సమయంలో స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ప్రాముఖ్యతను శ్రీకాంత్ నొక్కిచెప్పాడు. "ప్రపంచకప్‌లో భారత్ గెలవాలంటే బుమ్రానే కీలకం. అతను జట్టులో ఉంటేనే భారత్‌కు ప్రపంచకప్ గెలిచే అవకాశం ఉంది. బుమ్రా లేకపోతే, మిగతా బౌలర్లతో ఆ ఛాన్స్ లేదు. అతను టీమిండియాకు దొరికిన ఓ అన్‌కట్ డైమండ్. ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యం" అని స్పష్టం చేశాడు.

మరోవైపు యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ వన్డే ఫార్మాట్‌కు సరిపోడని శ్రీకాంత్ కుండబద్దలు కొట్టాడు. "అర్ష్‌దీప్ 50 ఓవర్ల ఆటకు సరిపోడు. బంతి స్వింగ్ అయితేనే అతని బౌలింగ్ ప్రభావవంతంగా ఉంటుంది. రెండు ఓవర్ల తర్వాత స్వింగ్ ఆగిపోతే తేలిపోతాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లోనూ ఇదే చూశాం. మొదటి ఓవర్ అద్భుతంగా వేశాడు, ఆ తర్వాత బ్యాటర్లు అతడిని చితక్కొట్టారు" అని విశ్లేషించాడు. దక్షిణాఫ్రికా పిచ్‌లపై ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ రాణించగలరని, వారితో పాటు ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, మొహ్సిన్ ఖాన్ వంటి యువ బౌలర్లను కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించాడు.

Advertisement
Krishnamachari Srikkanth
Mohammed Shami
Jasprit Bumrah
Indian Cricket Team
Arshdeep Singh
Cricket World Cup 2027

More Telugu News