Advertisement

స్కూల్‌ నుంచి వచ్చిన వెంటనే పిల్లలపై ప్రశ్నల వర్షం వద్దు.. సైకాలజిస్టుల కీలక సూచన

Child Psychologists suggest not to bombard children with questions immediately after school
  • స్కూల్ నుంచి రాగానే అడిగే రొటీన్ ప్రశ్నలతో పిల్లల్లో తీవ్ర విసుగు
  • మొదటి ఐదు నిమిషాలు ప్రశ్నల కంటే ఆత్మీయ స్పర్శే ముఖ్యం
  • ‘ఈరోజు ఎలా గడిచింది?’ బదులు చిన్న చిన్న నిర్దిష్ట ప్రశ్నలు మేలు
  • మెదడు అలసట తగ్గడానికి పిల్లలకు సమయం అత్యవసరం
  • చిరునవ్వు, స్నాక్స్, ఆప్యాయ పలకరింపులతో సంభాషణలు ప్రారంభించాలి
  • నిలదీసినట్లు కాకుండా సహజ వాతావరణంలోనే బంధాల బలోపేతం
స్కూల్‌ నుంచి పిల్లలు పరుగెత్తుకుంటూ వచ్చి బ్యాగులు పక్కన పడేసి, షూ విప్పేసి ఆదరాబాదరాగా ఇంట్లోకి అడుగుపెడతారు. అలా రాగానే దాదాపు ప్రతి ఇంట్లోనూ తల్లిదండ్రుల నుంచి ఒకే రొటీన్ ప్రశ్న ఎదురవుతుంది.. ‘‘ఈరోజు స్కూల్ ఎలా గడిచింది?’’. దానికి పిల్లల నుంచి వచ్చే సమాధానం కూడా అంతే రొటీన్‌గా ‘‘బాగానే ఉంది’’, ‘‘ఏం లేదు’’ అని ఒకే ఒక్క మాటతో ముగుస్తుంది. రోజంతా పిల్లలకు దూరంగా ఉండి, వాళ్ల విశేషాలు తెలుసుకోవాలనే ఆరాటం తల్లిదండ్రుల్లో ఉండటం చాలా సహజం. 

అయితే, పిల్లలు బడి విశేషాలు చెప్పకపోవడానికి కారణం వాళ్లకు మాట్లాడటం ఇష్టం లేక కాదు. సమయం సరైనది కాకపోవడమేనని చైల్డ్ సైకాలజిస్టులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఫస్ట్ ఫైవ్ మినిట్స్ రూల్’ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. బడి నుంచి రాగానే ప్రశ్నల వర్షం కురిపించకుండా, మొదటి ఐదు నిమిషాలు పిల్లలకు ప్రశాంతంగా రీఛార్జ్ అయ్యే సమయం ఇవ్వడమే ఈ నియమం ముఖ్య ఉద్దేశం.

టైమ్స్ఆఫ్ ఇండియా కథనం ప్రకారం... బడి వాతావరణం పిల్లలకు తీవ్ర మానసిక ఒత్తిడితో కూడుకున్నది. తరగతి గదిలో శ్రద్ధగా వినడం, రూల్స్ పాటించడం, తోటి పిల్లలతో సర్దుకుపోవడం, నిరంతరం అల్లరి, కేరింతల మధ్య గడపడం వల్ల రోజంతా వాళ్లు మానసికంగా, శారీరకంగా ఎంతో శక్తిని కోల్పోతారు. ఇంటికి వచ్చేసరికి వాళ్లలో సహనం పూర్తిగా ఆవిరైపోతుంది. సరిగ్గా ఆ సమయంలో ఇంట్లోకి రాగానే ప్రశ్నలు అడిగితే అది వాళ్లకు మరొక హోమ్‌వర్క్‌లా, ఇన్వెస్టిగేషన్‌లా అనిపిస్తుంది. అందుకే రాగానే ప్రశ్నలు అడిగే బదులు, ఆ సమయాన్ని ప్రశాంతమైన వాతావరణంలో గడిపేలా చూడటం ఎంతో ముఖ్యం.

‘‘ఈరోజు ఎలా గడిచింది?’’ అనే ప్రశ్న చూడటానికి చాలా సాధారణంగానే అనిపిస్తుంది. కానీ, ఇది చాలా విశాలమైన ప్రశ్న. రోజంతా ఏడెనిమిది గంటల పాటు చదువు, ఆటలు, క్లాస్‌మేట్స్‌తో సరదాలు, రకరకాల అనుభవాలను ఒక్క మాటలో క్రమపద్ధతిలో చెప్పడం చిన్నపిల్లలకు చాలా కష్టం. అంత సమాచారాన్ని గుర్తు తెచ్చుకోవడానికి వాళ్ల మెదడు సహకరించదు. అందుకే ‘‘బాగానే గడిచింది’’ అని ఒకే మాటతో సంభాషణను ముగిస్తారు.

అలా కాకుండా వాళ్లు సులభంగా చెప్పగలిగే చిన్న చిన్న ప్రశ్నలు అడగాలి. ‘‘ఈరోజు బడిలో నిన్ను నవ్వించిన విషయమేంటి?’’, ‘‘లంచ్‌లో ఎవరితో కలిసి కూర్చున్నావు?’’, ‘‘ఈరోజు పీఈటీ పీరియడ్‌లో ఏం ఆడారు?’’ అని అడిగితే పిల్లలు ఉత్సాహంగా పంచుకుంటారు. అలాగే మీ రోజంతా ఎలా గడిచిందో ముందుగా మీరు చెబుతుంటే, వాళ్లూ దాన్ని అనుకరించి మాట్లాడటానికి ముందుకొస్తారు.

బడి నుంచి రాగానే మాట్లాడకుండా మౌనంగా ఉన్నంత మాత్రాన ఏదో జరిగిపోయిందని కంగారు పడక్కర్లేదు. కొందరు పిల్లలు అంతర్గతంగా ఆలోచించిన తర్వాతే విషయాలు బయటకు చెబుతారు. డ్రాయింగ్ వేస్తున్నప్పుడు, రాత్రి భోజనం చేస్తున్నప్పుడు లేదా పార్కులో నడుస్తున్నప్పుడు పిల్లలు ఎక్కువగా మాట్లాడతారు. ఎదురెదురుగా కూర్చొని ప్రశ్నించే వాతావరణం లేనప్పుడే పిల్లలు స్వేచ్ఛగా మనసు విప్పుతారు. 

మన లక్ష్యం కేవలం సమాచారం సేకరించడం మాత్రమే కాకూడదు. వాళ్లలో నమ్మకాన్ని పెంచడం. ఇంటికొచ్చిన వెంటనే తమకు స్వేచ్ఛ, ఆత్మీయత లభిస్తున్నాయనే భావన పిల్లల్లో కలగాలి. ఈ వాతావరణమే భవిష్యత్తులో వాళ్లు ఎలాంటి సమస్యనైనా తల్లిదండ్రులతో భయం లేకుండా పంచుకునేలా చేస్తుంది.
Advertisement
Child Psychologists
Parenting Tips
School Children
First Five Minutes Rule
Child Mental Health
Communication with Kids

More Telugu News