Advertisement

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు నన్ను హీరోను చేయొద్దు: అభిజీత్ దీప్కే

Abhijit Dipke says do not make me a hero for Dharmendra Pradhan resignation
  • నీట్ వివాదంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
  • వ్యక్తి పూజతోనే దేశం నాశనమైందని, తనను హీరో చేయొద్దని కోరిన అభిజీత్ దీప్కే
  • ఇది తొలి వికెట్ మాత్రమే, విద్యా వ్యవస్థను మార్చే వరకు పోరాటం ఆగదన్న దీప్కే
  • ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ‘మామూ, తెల్లారింది’ అంటూ వ్యంగ్యాస్త్రాలు
  • మృతుల కుటుంబాలకు కోటి పరిహారం, ఆందోళనకారులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్
నీట్ పరీక్షల లీకేజీ వివాదం చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసింది. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేయగా, ఈ పరిణామంపై ఉద్యమానికి నాయకత్వం వహించిన 'కాక్రోజ్ జనతా పార్టీ' వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తీవ్రంగా, భావోద్వేగంగా స్పందించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు తనను హీరోగా కీర్తించవద్దని, ఆ ఘనత తనది కాదని ఆయన స్పష్టం చేశారు.

"ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు నన్ను హీరోను చేయకండి. దయచేసి ఆ తప్పు చేయొద్దు. ఒక వ్యక్తిని హీరోను చేయడం వల్లే ఈ దేశం నాశనమైంది. ఒక వ్యక్తిని రాజ్యాంగం కంటే, వ్యవస్థల కంటే గొప్పవాడిని చేశారు. సమస్య కంటే వ్యక్తిని గొప్పగా చూసినప్పుడు, ఆ వ్యక్తి దేశాన్ని నాశనం చేయక తప్పదు. కాబట్టి ఎవరూ నన్ను హీరోను చేయవద్దు. నినాదాలు చేయాలనుకుంటే 'భారత్ మాతా కీ జై', 'ఇంక్విలాబ్ జిందాబాద్' అని నినదించండి" అని జంతర్ మంతర్ వద్ద గుమిగూడిన విద్యార్థులను ఉద్దేశించి దీప్కే అన్నారు.

ప్రధాని మోదీని ఉద్దేశించి "సుబహ్ హో గయీ మామూ" (మామా, తెల్లారింది) అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "ఇప్పుడు ప్రజాస్వామ్యానికి ఉదయం అయింది. దేశ ప్రజలు మేల్కొన్నారు. నేను చెప్పినట్లే ఇది తొలి వికెట్ మాత్రమే. ఇక్కడితో మేము ఆగబోము. ఇది కేవలం ఆరంభం మాత్రమే," అని ఆయన హెచ్చరించారు. ఈ విజయం సామాన్యుడిదని, వ్యవస్థ సృష్టించిన మురికి గుంట నుంచి బయటకు వచ్చిన 'బొద్దింకల' విజయమని అభివర్ణించారు. ఇది దేశ యువత, భవిష్యత్తు, భారతదేశ కలకు దక్కిన విజయమని పేర్కొన్నారు. 

ఇక, యువతను కాక్రోచ్ లంటూ వ్యాఖ్యానించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కు ధన్యవాదాలు తెలుపుతున్నామని దీప్కే అన్నారు. ఆయన వల్లే ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సాధ్యమైందని వ్యాఖ్యానించారు.

గత 36 రోజులుగా 45 డిగ్రీల ఎండలో, వర్షంలో, పోలీసులు నీళ్లు, ఆహారం నిలిపివేసినా మొక్కవోని దీక్షతో పోరాడిన విద్యార్థులకు, వాలంటీర్లకు దీప్కే సెల్యూట్ చేశారు. ఈ దేశం ఎవరో ఒకరి మనసు ప్రకారం కాదని, రాజ్యాంగం ప్రకారమే నడుస్తుందని విద్యార్థులు నిరూపించారని ప్రశంసించారు. "ఒకప్పుడు జంతర్ మంతర్ వద్ద స్వాతంత్య్రం కోసం తెల్లదొరలతో పోరాడాం. ఇప్పుడు నల్లదొరలను తరిమికొట్టాం" అని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే, ఈ పోరాటం ఇంకా ముగియలేదని అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. ప్రభుత్వంతో ఇంకా చర్చలు జరగాల్సి ఉందని తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం, నీట్ వివాదంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ. 1 కోటి నష్టపరిహారం, ఆందోళనకారులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీ తీసుకుంటామని ప్రకటించారు. విద్యా వ్యవస్థను సమూలంగా మార్చే వరకు తమ పోరాటం ఆగదని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఈ ఉద్యమంలో పోలీసు లాఠీ దెబ్బలు తిన్న విద్యార్థులను స్మరించుకుంటూ ఈ సాయంత్రం దేశవ్యాప్తంగా శాంతియుత కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాలని పిలుపునిచ్చారు.

Advertisement
Abhijit Dipke
Dharmendra Pradhan
NEET exam leak
Cockroach Janata Party
Education Minister resignation
Delhi student protests

More Telugu News