Advertisement

ఇరాన్‌పై ఇప్పుడే భారీ దాడులు ఉండవు: ట్రంప్

Donald Trump Says No Major Attacks On Iran Right Now
  • ఇరాన్‌పై భారీ సైనిక దాడులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న ట్రంప్ 
  •  వాషింగ్టన్‌తో చర్చల విషయంలో ఇరాన్ సీరియస్‌గా ఉందని ప్రకటన 
  •  అణు ఆయుధ తయారీ దిశగా వెళ్తేనే అమెరికా ‘రెడ్ లైన్’ దాటుతుందని వెల్లడి  
ఇరాన్‌తో నెలకొన్న యుద్ధ వాతావరణం మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై భారీ స్థాయి మిలిటరీ ఆపరేషన్‌ను ప్రారంభించే అంశంపై తాను ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికాతో చర్చల విషయంలో టెహ్రాన్ యంత్రాంగం ‘చాలా తీవ్రంగా’ ఆలోచిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

ఓవల్ ఆఫీస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్‌కు రెండు మార్గాలు ఉన్నాయని చెప్పారు. ఒకటి తమతో శాంతి ఒప్పందానికి రావడం, లేదా మునుపటి కంటే తీవ్రమైన క్షిపణి దాడులను ఎదుర్కోవడమని చెప్పారు. అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేయకుండా నిరోధించేందుకే తాము గత రెండు వారాలుగా దాడులు చేస్తున్నామని, దీనికి ప్రతిగా ఇరాన్ జరిపిన దాడుల్లో నలుగురు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. "మా సైన్యం పూర్తి సద్ధతతో ఉంది. కానీ ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయి కాబట్టి ఫలితం ఏమొస్తుందో వేచి చూద్దాం" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ గనుక అణు ఆయుధాలను తయారు చేసే స్థాయికి చేరుకుంటే మాత్రం అది తమ సహనానికి 'రెడ్ లైన్' అవుతుందని హెచ్చరించారు.

మరోవైపు, ఇరాన్‌కు చైనా, రష్యాలు నిఘా సహకారాన్ని, ఆయుధాలను అందిస్తున్నాయన్న వార్తలను ట్రంప్ తోసిపుచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు ఇరాన్‌కు ఆయుధాలు విక్రయించబోమని తనకు వ్యక్తిగతంగా హామీ ఇచ్చారని, వారి మాటపై తనకు నమ్మకముందని పేర్కొన్నారు.  
Advertisement
Donald Trump
US Iran Conflict
Strait of Hormuz
Tehran Negotiations
Iran Nuclear Weapons
US Military Operation

More Telugu News