Advertisement

లండన్ లగ్జరీ హోటల్‌లో సౌదీ రాకుమారుడి మృతి.. విచారణలో కీలక విషయాలు

Saudi Prince death in London luxury hotel key details in investigation
  • మద్యం, డ్రగ్స్ కలిపి తీసుకోవడంతో ప్రమాదవశాత్తు మరణించినట్లు నిర్ధారణ
  • రక్తంలో అధిక స్థాయిలో ఆల్కహాల్, యాంగ్జైటీ మందులు ఉన్నట్లు గుర్తింపు
  • ఇది ఆత్మహత్య కాదని, ఎలాంటి కుట్ర జరగలేదని యూకే కోర్టు స్పష్టం
సౌదీ అరేబియాకు చెందిన 29 ఏళ్ల యువరాజు అబ్దుల్లా బిన్ ఫహాద్ లండన్‌లోని ఒక విలాసవంతమైన హోటల్‌లో కన్నుమూయడంపై స్పష్టత వచ్చింది. మితిమీరిన మద్యం, మాదకద్రవ్యాల వల్లే ఆయన ప్రమాదవశాత్తు మరణించినట్లు యూకే దర్యాప్తులో తేలింది. ఈ మరణంలో ఎలాంటి కుట్ర కోణం లేదని, ఇది ఆత్మహత్య కూడా కాదని స్థానిక కోర్టు స్పష్టం చేసింది. గతేడాది చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి విచారణలో తాజాగా కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

2025 నవంబర్ 25న లండన్‌లోని కెన్సింగ్‌టన్‌ ప్రాంతంలో ఉన్న మారియట్ హోటల్ గదిలోని బాత్రూమ్‌లో ప్రిన్స్ అబ్దుల్లా అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. పారామెడికల్ సిబ్బంది ఆయనను పరీక్షించి, అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. ఇన్నర్ వెస్ట్ లండన్ కరోనర్ కోర్టులో జరిగిన విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. టాక్సికాలజీ నివేదిక ప్రకారం, ఆయన రక్తంలో బ్రిటన్ చట్టబద్ధమైన డ్రైవింగ్ పరిమితి కంటే మూడు రెట్లు అధికంగా మద్యం ఉన్నట్లు తేలింది. దీనితో పాటు ఆయన శరీరంలో 'జీహెచ్‌బీ' వంటి పార్టీ డ్రగ్స్, గంజాయి ఆనవాళ్లు, ఆందోళనను తగ్గించే 'జానాక్స్' ఔషధాల మోతాదు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. వీటన్నింటి మిశ్రమ ప్రభావంతో గుండెపోటు రావడమే మరణానికి కారణమని కోర్టు నిర్ధారించింది.

ప్రిన్స్ అబ్దుల్లా కొంతకాలంగా మద్యపానంతో పాటు జానాక్స్ వంటి ఔషధాలకు బానిసయ్యారని, ఇందుకోసం ఆయన చికిత్స కూడా పొందినట్లు విచారణలో వెల్లడైంది. చికిత్సలో భాగంగా 2025 ఆగస్టులో ఆయన 'డిటాక్స్' ప్రక్రియను కూడా పూర్తి చేశారు. అయితే, ఆయనకు ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు లేవని వైద్యులు కోర్టుకు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, ఘటనకు ముందు రోజు రాత్రి ఆయన ఒంటరిగానే తన గదికి వెళ్లినట్లు నిర్ధారణ అయింది. 2025 డిసెంబర్ 2న సౌదీ రాయల్ కోర్టు ఆయన మరణాన్ని అధికారికంగా ప్రకటించగా, రియాద్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.
Advertisement
Prince Abdullah bin Fahad
Saudi Prince
London Marriott Hotel
Accidental drug overdose
Kensington London

More Telugu News