డైనోసార్లను తుడిచిపెట్టేసిన గ్రహశకలం అత్యంత అరుదైనది.. రహస్యం ఛేదించిన శాస్త్రవేత్తలు!

Asteroid that wiped out dinosaurs was extremely rare scientists solve mystery
  • 6.6 కోట్ల సంవత్సరాల క్రితం భూమిడి ఢీకొన్న CO కాండ్రైట్ రకానికి చెందిన  గ్రహశకలం  
  • మెక్సికోలోని యుకాటన్ తీరాన్ని ఢీకొన్న గ్రహశకలం 
  • భూమిపై ఉన్న 75 శాతం జీవజాతులు నాశనం

సుమారు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై నుంచి డైనోసార్ల జాతిని పూర్తిగా అంతరించిపోయేలా చేసిన గ్రహశకలం గురించిన ఒక అద్భుతమైన నిజాన్ని శాస్త్రవేత్తలు వెలికితీశారు. సౌర వ్యవస్థలోనే అత్యంత పురాతనమైన, అరుదైన 'CO కాండ్రైట్' (CO Chondrite) రకానికి చెందిన అంతరిక్ష శిల వల్ల ఈ ప్రళయం సంభవించిందని అంతర్జాతీయ పరిశోధకుల బృందం గుర్తించింది. యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా (UBC), పారిస్, బ్రస్సెల్స్, వియన్నా పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయన వివరాలు 'సైన్స్ అడ్వాన్సెస్' పత్రికలో ప్రచురితమయ్యాయి.  


ఆనాటి వినాశనం తర్వాత ఏర్పడిన పలుచని మట్టి పొరలో పదిలంగా ఉన్న నికెల్ ఐసోటోప్‌లను విశ్లేషించి శాస్త్రవేత్తలు ఈ ముగింపునకు వచ్చారు. 6.6 కోట్ల ఏళ్ల క్రితం మెక్సికోలోని యుకాటన్ తీరాన్ని సుమారు 10 కిలోమీటర్ల వెడల్పున్న గ్రహశకలం ఢీకొట్టి, భారీ 'చిక్సులబ్' బిలాన్ని ఏర్పరచడంతో పాటు భూగ్రహంపై ఉన్న 75 శాతం జీవజాతులను నాశనం చేసింది. ఈ తీవ్ర ఘాతానికి విపరీతమైన భూకంపాలు, రాకాసి సునామీలు, కార్చిచ్చులు చెలరేగగా.. వాతావరణంలోకి దట్టంగా అలముకున్న ధూళి, వాయువులు సూర్యకాంతిని కొన్నేళ్ల పాటు అడ్డుకుని భూ వాతావరణాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి.  


తాజా పరిశోధన ప్రకారం, భూమిపై లభించే గ్రహశకలాల అవశేషాల్లో ఈ 'CO కాండ్రైట్' రకం కేవలం 5 శాతం మాత్రమే ఉంటుంది. ఇవి గురు గ్రహం సమీపంలోని బయటి ఆస్టరాయిడ్ బెల్ట్ నుంచి లేదా సౌర వ్యవస్థ చివరి సరిహద్దుల నుంచి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. సాధారణంగా భావించేలా గ్రహశకలంలో ఉన్న గంధకం (సల్ఫర్) కంటే కూడా, దాని దాడి వల్ల ఆకాశంలోకి ఎగసిపడిన అతి సూక్ష్మ ధూళి కణాలే సూర్యకాంతిని పూర్తిగా కప్పివేసి వినాశనానికి ప్రధాన కారణమయ్యాయని పరిశోధకులు స్పష్టం చేశారు. విశ్వంలోనే అత్యంత అరుదైన ఒక గ్రహశకలం భూమిని ఢీకొట్టడం అప్పట్లో డైనోసార్ల దురదృష్టానికి నిదర్శనమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Advertisement
Asteroid
CO Chondrite
Dinosaurs
Chicxulub Crater
Extinction
Science Advances

More Telugu News