ప్రముఖ కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్‌పై (Truecaller) టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రత్యేకంగా కేటాయించిన 140, 1600 సిరీస్ నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌కు "ఫ్రీక్వెంట్లీ బ్లాక్డ్" (frequently blocked) అనే ట్యాగ్ చూపించడాన్ని తప్పుబట్టింది. ఇలాంటి లేబుల్స్ వల్ల ప్రభుత్వ, వాణిజ్య సంస్థల నుంచి వచ్చే ముఖ్యమైన కాల్స్‌పై వినియోగదారుల్లో అనవసరమైన అనుమానాలు, గందరగోళం తలెత్తుతాయని ట్రాయ్ పేర్కొంది.

నిబంధనల ప్రకారం కేటాయించిన నంబర్ సిరీస్‌లకు ఇలాంటి ట్యాగ్‌లు పెట్టడం సరైన పద్ధతి కాదని ట్రాయ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీనికి బదులుగా, అవాంఛిత ప్రమోషనల్ కాల్స్‌ను అడ్డుకోవడానికి ట్రాయ్ అధికారిక డూ నాట్ డిస్టర్బ్ (DND) యాప్‌ను ఉపయోగించుకోవచ్చని వినియోగదారులకు ట్రూకాలర్ తెలియజేయాలని సూచించారు. డీఎన్‌డీ వ్యవస్థపై ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా సమస్యను మరింత సమర్థవంతంగా పరిష్కరించవచ్చని ట్రాయ్ అభిప్రాయపడింది.

ట్రాయ్ నిబంధనల ప్రకారం, 1600 సిరీస్ నంబర్లను ఆర్‌బీఐ, సెబీ, ఐఆర్‌డీఏఐ వంటి సంస్థల పర్యవేక్షణలో ఉండే బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ప్రభుత్వ సమాచారం వంటి ముఖ్యమైన కాల్స్ కోసం కేటాయించారు. ఇక 140 సిరీస్‌ను రిజిస్టర్డ్ సంస్థలు చేసే ప్రమోషనల్ కాల్స్ కోసం కేటాయించారు. ముఖ్యంగా 1600 సిరీస్ నంబర్లకు ఎలాంటి నెగటివ్ ట్యాగ్స్ పెట్టకూడదని, ఎందుకంటే వాటిలో మోసాల గురించి హెచ్చరికలు, లావాదేవీల ధ్రువీకరణ వంటి కీలక సమాచారం ఉండవచ్చని ట్రాయ్ స్పష్టం చేసింది.

మరోవైపు, ట్రాయ్ కొత్త నిబంధనల తర్వాత స్పామ్ కాల్స్ పెరిగాయని, దీంతో వినియోగదారులే ఈ నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను బ్లాక్ చేస్తున్నారని, తద్వారా అసలైన వ్యాపార కాల్స్‌పై కూడా నమ్మకం తగ్గుతోందని ట్రూకాలర్ వాదిస్తోంది. ఈ ట్యాగింగ్ విషయంలో గత కొంతకాలంగా ట్రాయ్, ట్రూకాలర్ మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి.