కేసీఆర్ కుటుంబీకులు నిజాం రాజును మించిన ధనవంతులుగా మారారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy says KCR family became richer than Nizam king
  • ఘట్‌కేసర్‌లో అందెశ్రీ స్మృతివనానికి భూమిపూజ
  • అందెశ్రీ ఒక ఆత్మబంధువు అని కొనియాడిన సీఎం రేవంత్ రెడ్డి
  • కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు
  • ఏడాదిలోనే 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడి
  • తాను సీఎంగా ఉండగా బీఆర్ఎస్ అధికారంలోకి రాదని స్పష్టం
కేసీఆర్ కుటుంబం వందలాది ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు నిర్మించుకుందని, వారు నిజాం రాజును మించిన ధనవంతులుగా ఎదిగారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రముఖ కవి, గాయకుడు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిదాత అందెశ్రీ గౌరవార్థం ఘట్‌కేసర్‌లో నిర్మించనున్న 'అందెశ్రీ స్మృతివనం' పనులకు ముఖ్యమంత్రి శనివారం భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

"దొరల గడీల ముందు తలవంచను" అని చాటిచెప్పిన ధైర్యశాలి అందెశ్రీ అని ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రజల కవిగా, గాయకుడిగా అందెశ్రీ అందించిన సేవలను స్మరించుకుంటూ, ఆయనను తన 'ఆత్మబంధువు'గా అభివర్ణించారు. గత పాలకులు ఆయన వంటి గొప్ప కళాకారులను విస్మరించారని మండిపడ్డారు. ఇదే క్రమంలో, కల్వకుంట్ల కుటుంబంపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ యువతను పట్టించుకోకపోవడంతో వారు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఏళ్ల తరబడి గ్రూప్-1 వంటి పరీక్షలు కూడా నిర్వహించలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకు భిన్నంగా, తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే సుమారు 70 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని, అభ్యర్థుల తల్లిదండ్రుల సమక్షంలోనే నియామక పత్రాలను అందజేస్తున్నామని తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

ఫామ్‌హౌస్‌ల నిర్మాణం కోసం కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను దోచుకుందని, మళ్లీ ఎవరైనా అటువంటి ప్రయత్నం చేస్తే ఎదిరించడానికి అందెశ్రీ పాట రూపంలో పుడతాడని హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందెశ్రీని తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని దుయ్యబట్టారు. ప్రజాకవి గద్దర్‌ను సైతం ప్రజాభవన్ గేటు వద్ద ఎర్రటి ఎండలో నిలబెట్టి అవమానించారని మండిపడ్డారు. వారిద్దరిని అవమానించినప్పుడే దొరల పాలనకు చరమగీతం పాడాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Advertisement
Revanth Reddy
KCR family
Andesri Smritivanam
Telangana politics
BRS party
Ghatkesar

More Telugu News