టీ-హబ్ బేబీ 'స్కైరూట్' చరిత్ర సృష్టించింది: కేటీఆర్
- శ్రీహరికోట నుంచి రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించిన స్కైరూట్
- టీహబ్ నుంచే స్కైరూట్ పురుడు పోసుకుందన్న కేటీఆర్
- ఆ సంస్థ ఇప్పుడు గ్లోబల్ స్థాయికి ఎదగడం అందరికి స్ఫూర్తిదాయకమని వ్యాఖ్య
హైదరాబాద్ సరూర్ నగర్ వేదికగా జరిగిన 'యువ సంగ్రామ సదస్సు'లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ నమోదైన కీలక అంతరిక్ష విజయాన్ని పంచుకున్నారు. దేశంలోనే తొలిసారిగా శ్రీహరికోట నుంచి ప్రైవేట్ రాకెట్ 'విక్రమ్-1' విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ అద్భుత రికార్డు సృష్టించిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ మరెక్కడో కాదు.. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన 'టీ-హబ్' వేదికగానే పురుడు పోసుకుందని గర్వంగా ప్రకటించారు.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు పూర్తయిన తరుణంలో... దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ ఒక ప్రైవేట్ రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపిన ఘనత స్కైరూట్ కంపెనీకే దక్కుతుందని కేటీఆర్ కొనియాడారు. మన హైదరాబాద్‌లోని టీ-హబ్ వేదికగా స్టార్టప్‌గా ప్రస్థానం మొదలుపెట్టిన ఒక సంస్థ, ఇవాళ ప్రపంచ స్థాయిలో దేశం గర్వించేలా ఎదగడం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు.
శ్రీహరికోట సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం అత్యంత విజయవంతంగా ముగిసిందని కేటీఆర్ తెలిపారు. ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించిన స్కైరూట్ టీమ్‌కు సభకు హాజరైన నిరుద్యోగ యువత, విద్యార్థులంతా చప్పట్లతో ఘనంగా అభినందనలు తెలపాలని అన్నారు.
మరోవైపు, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సహకారంతో ప్రైవేట్ రంగానికి చెందిన తొలి దేశీయ రాకెట్ ప్రయోగం సక్సెస్ కావడంతో... అటు ఇస్రో సైంటిస్టులతో పాటు ఇటు స్కైరూట్ కంట్రోల్ సెంటర్‌లోనూ పండుగ వాతావరణం నెలకొంది.