గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త, పాప్ సింగర్/నటుడు నిక్ జోనాస్ మధ్య ఉన్న ప్రేమ, అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ జంట తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది. ప్రియాంక తన భర్త నిక్‌ను ఇంట్లో ముద్దుగా 'బాబు' అని పిలుస్తుందట. ఈ సరదా సంగతి జోనాస్ బ్రదర్స్ పోడ్‌కాస్ట్ తాజా ఎపిసోడ్‌లో బయటకు వచ్చింది. ఈ ముద్దు పేరు, వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

జోనాస్ బ్రదర్స్ అయిన కెవిన్, జో నిర్వహిస్తున్న పోడ్‌కాస్ట్‌లో ప్రియాంక, నిక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సరదా రాపిడ్-ఫైర్ సెగ్మెంట్‌లో వీరిద్దరి బంధానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంట్లో నిక్‌ను తాను 'బాబు' అని పిలుస్తానని ప్రియాంక చెప్పగా, ఆ పిలుపు వినగానే ఆమెకు ఏదో సహాయం కావాలని తనకు వెంటనే అర్థమవుతుందని నిక్ వివరించాడు.

ఈ విషయం గురించి ప్రియాంక నవ్వుతూ మాట్లాడుతూ.. "నిక్ ఇంట్లో ఉన్నప్పుడు నా చేతులు పనిచేయవు. ప్రతీదానికీ 'బాబు' అనే పిలుస్తాను" అని అన్నారు. దీనికి నిక్ స్పందిస్తూ.. "ఆ పిలుపు వినగానే నేను 'ఎస్, చెప్పండి' అన్నట్లుగా స్పందిస్తాను" అని తెలిపారు. "బాబు, రిమోట్ పనిచేయడం లేదు", "బాబు, ఇంటర్నెట్ రావడం లేదు", "కాస్త డ్రింక్ ఇస్తావా?" అంటూ ఇంట్లో తాను నిక్‌ను ఎలా పనులకు పురమాయిస్తానో ప్రియాంక సరదాగా వివరించారు. ఈ సంభాషణ విన్న కెవిన్, జో గట్టిగా నవ్వేశారు. "ఆహా, మాకు ఇది బాగా నచ్చింది. ప్రతీ జంటకు వారిదైన డైనమిక్ ఉంటుంది. మీ బంధాన్ని చూడటం మాకు చాలా ఇష్టం" అంటూ ప్రశంసించారు. దీనికి ప్రియాంక బదులిస్తూ.. "అవును, ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. ఐ లవ్ యూ, నిక్" అని తన ప్రేమను వ్యక్తపరిచారు.

ఇదే పోడ్‌కాస్ట్‌లో మరికొన్ని విషయాలు కూడా పంచుకున్నారు. నిక్‌లో శారీరకంగా తనకు బాగా నచ్చిన అంశం ఏంటని అడగ్గా, అతని 'విశాలమైన వీపు' అని ప్రియాంక చెప్పిన సమాధానాన్ని నిక్ సరిగ్గా ఊహించాడు. అలాగే, నిక్ వార్డ్‌రోబ్ నుంచి ఏదైనా ఒక వస్తువును తీసేయాల్సి వస్తే, అది అతని 'గోల్ఫ్ దుస్తులు' అని ప్రియాంక అన్నారు. "గోల్ఫ్ ఆడేటప్పుడు నిన్ను కోల్పోతాను. అందుకే ఆ బట్టలు తీసేయాలి. కానీ, ఆ దుస్తుల్లో నువ్వు చాలా హాట్‌గా కనిపిస్తావు" అని సరదాగా వ్యాఖ్యానించారు.

కాగా, ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ 2018 డిసెంబర్‌లో జోధ్‌పూర్‌లో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదితో వీరి వివాహ బంధానికి తొమ్మిదేళ్లు పూర్తవుతున్నాయి. ఈ జంటకు 2022 జనవరిలో సరోగసీ ద్వారా కుమార్తె మాల్తీ మేరీ చోప్రా జోనాస్ జన్మించింది.