‘ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క’.. సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ సవాల్‌

KTR challenges CM Revanth Reddy saying things will be different from now on
  • ఉద్యోగాలపై కాంగ్రెస్‌ను నిలదీసిన కేటీఆర్
  • 70 వేల ఉద్యోగాలపై బహిరంగ సవాల్
  • నోటిఫికేషన్లు కాదు.. లూటిఫికేషన్ జరుగుతోందని విమర్శ
  • హామీలు నెరవేర్చకపోతే యువతే తీర్పు చెబుతుందన్న వ్యాఖ్య
  • యువ సంగ్రామ సదస్సులో మాట్లాడిన కేటీఆర్‌
తెలంగాణలో ఉద్యోగాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం యువతను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా ఉద్యోగ ‘నోటిఫికేషన్ల’ స్థానంలో ‘లూటిఫికేషన్లు’ చేస్తున్నారని విమర్శించారు. సరూర్‌నగర్‌లో నిర్వహించిన ‘యువ సంగ్రామ’ సదస్సులో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘రేవంత్ గుర్తు పెట్టుకో.. నీ క్లైమాక్స్ హిట్లర్ కంటే దారుణంగా ఉంటుంది’’ అని హెచ్చరించారు.

‘‘ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క. కాంగ్రెస్ ప్రభుత్వానికి యువతే తగిన గుణపాఠం చెబుతుంది. ప్రజలు, నిరుద్యోగ యువత ఈ అవమానాలను ఎప్పటికీ మర్చిపోరు’’ అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రపంచంలోనే అతిపెద్ద మోసమని ఆరోపించారు. ఎన్నికల సమయంలో మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అశోక్‌నగర్‌లో ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను విస్మరించారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ఉద్యోగాల క్యాలెండర్‌ను పక్కనపెట్టి జేబులు నింపుకోవడంపైనే దృష్టి పెట్టారని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వం చెబుతున్నట్లు 70 వేల ఉద్యోగాలు నిజంగానే ఇచ్చి ఉంటే.. అందుకు సంబంధించిన నోటిఫికేషన్లతో సహా నిరూపించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. అలా నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకొని రాహుల్ గాంధీకి జై కొడతానని ప్రకటించారు. ఈ సభ కాంగ్రెస్ చేసిన ‘మహాద్రోహాన్ని’ యువతకు గుర్తు చేసేందుకేనని అన్నారు.

ఉద్యోగాలు అడిగిన యువతపై పోలీసులు దాడులు చేయడం దారుణమని కేటీఆర్ మండిపడ్డారు. యువత ఆకాంక్షలను అర్థం చేసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అహంకారంతో వ్యవహరిస్తోందని విమర్శించారు.

కేసీఆర్ హయాంలో జారీ చేసిన నోటిఫికేషన్లకే ఇప్పుడు నియామక పత్రాలు ఇచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్రెడిట్ తీసుకుంటోందని కేటీఆర్ ఆరోపించారు. ఒక మంత్రి ఒక మాట, మరో మంత్రి మరో మాట చెబుతూ ఉద్యోగాల విషయంలో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో భూములు, ఇసుక లూటీ జరుగుతోందని, ప్రజలు హామీల గురించి ప్రశ్నిస్తే వారిని అవమానిస్తున్నారని విమర్శించారు.
Advertisement
KTR
Revanth Reddy
Telangana Jobs
BRS Yuva Sangrama
Congress Job Guarantees
Telangana Politics

More Telugu News