ఏపీలో విషాదం.. గోదావరిలో చేపలు పట్టేందుకు వెళ్లి ఐదుగురు గిరిజనుల మృతి
- పోలవరం ఎటపాక మండలం గొమ్ముకొత్తగూడెంలో విషాదం
- గోదావరి ప్రవాహ వేగానికి కొట్టుకుపోయిన గిరిజనులు
- గల్లంతైన వారికోసం విస్తృత గాలింపు
ఆంధ్రప్రదేశ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పోలవరం జిల్లా ఎటపాక మండల పరిధిలోని గొల్లగూడెం సమీపంలో గోదావరి నదిలో ఐదుగురు గిరిజనులు గల్లంతయ్యారు. వారిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక మత్స్యకారులు, ఈతగాళ్ల సహాయంతో గోదావరి నదిలో గల్లంతైన వారి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. తీవ్ర గాలింపు అనంతరం వారి మృతదేహాలను వెలికి తీశారు. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే... నిత్యం వెళ్లేలాగే వీరంతా కలిసి గోదావరి నదిలో చేపలు పట్టేందుకు వెళ్లారు. అయితే నదిలో ఒక చోట అంచనా తప్పి, ఊహించని విధంగా నీటి లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి దిగడంతో ప్రవాహ వేగానికి కొట్టుకుపోయారు. మృతి చెందిన వారందరినీ గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఒకే గ్రామానికి చెందిన వారు మృతి చెందడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.