ఫ్రాన్స్‌లో ఇండియన్ స్టూడెంట్ బడ్జెట్ వైరల్: నెలకు రూ.81 వేలు ఖర్చు.. ఆ ఒక్క లెక్కపైనే నెటిజన్ల రచ్చ!

Indian student budget in France goes viral 81000 rupees monthly cost sparks debate
  • ఫ్రాన్స్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థిని నెలవారీ ఖర్చుల వీడియో వైరల్
  • రూ.10,900 (100 యూరోలు)కే నెల కిరాణా సాధ్యమన్న విద్యార్థిని
  • ఇంటి వంట వల్లే తిండి ఖర్చులు తగ్గాయని వెల్లడి
  • నెలకు రూ.10 వేల రేషన్ లెక్కింపుపై నెటిజన్ల మధ్య తీవ్ర చర్చ
ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే ఏ భారతీయ విద్యార్థినైనా అడగండి.. వారు ప్రతిరోజూ ఆలోచించే ఏకైక విషయం 'నెలవారీ బడ్జెట్'. ఇల్లు అద్దె, కిరాణా సరుకులు, ప్రయాణ ఖర్చులు.. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కలిసి జేబుకు పెద్ద చిల్లే పెడతాయి. తాజాగా ఫ్రాన్స్‌లో చదువుకుంటున్న ఒక భారతీయ విద్యార్థిని తన నెలవారీ ఖర్చులకు సంబంధించిన వివరాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి ఒక అవగాహన కల్పించడానికి ఆమె ఈ వీడియో చేసినప్పటికీ.. అందులో ఆమె చెప్పిన ఒకే ఒక్క లెక్క ఇప్పుడు ఇంటర్నెట్‌లో పెద్ద చర్చకు దారితీసింది. అదే ఆమె నెలవారీ తిండి ఖర్చుల వివరాలు.

నెలకు రూ.81,000 ఖర్చు.. అందులో సింహభాగం అద్దెకే!
ఫ్రాన్స్‌లోని లిల్లే నగరంలో బ్యాచిలర్స్ డిగ్రీ చదువుతున్న 20 ఏళ్ల రేన్  అనే భారతీయ విద్యార్థిని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఇంటర్నేషనల్ స్టూడెంట్‌గా ఉన్నందుకు తనకు నెలకు దాదాపు 750 యూరోలు (భారత కరెన్సీలో సుమారు రూ.81,000) ఖర్చవుతుందని ఆమె వివరించింది. మిగతా విద్యార్థుల లాగే ఆమె బడ్జెట్‌లో కూడా సింహభాగం ఇంటి అద్దెకే సరిపోతోంది. ఒక అపార్ట్‌మెంట్‌ను ఇతరులతో పంచుకుంటూ ఉంటున్నందుకు ఆమె నెలకు 550 యూరోలు (దాదాపు రూ.60,000) చెల్లిస్తోంది. అయితే తనకు ప్రత్యేకంగా ఒక బాత్రూమ్ సదుపాయం ఉండటం వల్ల ఈ అద్దె వర్కవుట్ అవుతుందని ఆమె పేర్కొంది.

అందరినీ ఆశ్చర్యపరిచిన రూ.10,900 కిరాణా బిల్లు!
ఈ వీడియో చూసిన వారంతా ముక్కున వేలేసుకునేలా చేసింది ఆమె కిరాణా బిల్లు. రేన్ నెల మొత్తానికి సరుకుల కోసం కేవలం 100 యూరోలు (దాదాపు రూ.10,900) మాత్రమే ఖర్చు చేస్తానని చెప్పింది. బయట హోటళ్లలో తినడం, ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయడం పూర్తిగా తగ్గించి.. ఇంట్లోనే స్వయంగా వండుకోవడం వల్లే ఈ స్థాయిలో ఖర్చును నియంత్రించగలిగానని ఆమె వెల్లడించింది. దీనితో పాటు స్టూడెంట్ ట్రాన్స్‌పోర్ట్ పాస్ కోసం నెలకు రూ.3,500 (32 యూరోలు), వీకెండ్‌లో స్నేహితులతో కాఫీ తాగడానికి, షాపింగ్ చేయడానికి మరో రూ.6,000 వరకు ఖర్చు చేస్తానని తెలిపింది.

నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు
ఈ వీడియోపై నెటిజన్లు రెండు గ్రూపులుగా విడిపోయి చర్చిస్తున్నారు. ఐరోపా దేశాల్లో విపరీతంగా పెరుగుతున్న ధరల మధ్య, కేవలం 100 యూరోలతో నెలంతా తిండి ఖర్చులు వెళ్లదీయడం అసాధ్యమని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. తాము ఇంట్లో వండుకున్నా ఇంతకంటే ఎక్కువ ఖర్చవుతుందని కొందరు వాదిస్తున్నారు. అలాగే లిల్లే నగరంలో షేరింగ్ రూమ్‌కు రూ.60 వేల అద్దె చాలా ఎక్కువని, అంతకంటే తక్కువ ధరకే ఒంటరిగా ఉండే స్టూడియో రూమ్‌లు దొరుకుతాయని కొందరు లెక్కింపులు మొదలుపెట్టారు. అయితే, ప్రణాళికాబద్ధంగా షాపింగ్ చేసేవారికి ఆ ఖర్చు సరిపోతుందని మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఏది ఏమైనా, విదేశీ చదువుల వెనుక ఉండే అసలు క్షేత్రస్థాయి బడ్జెట్ ఎలా ఉంటుందో ఈ వీడియో అందరికీ కళ్లకు కట్టింది.
Advertisement
Indian student Rayne
France cost of living
Monthly budget for students
Lille France
Study abroad expenses
Viral student budget

More Telugu News