వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని నిరూపిస్తూ, 91 ఏళ్ల వృద్ధుడు చేసిన సాహసం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బ్రిటన్‌లోని 'సర్రీ' కౌంటీ, క్రేన్లీ గ్రామానికి చెందిన 91 ఏళ్ల వృద్ధుడు అలాన్ స్టిల్, సేవా కార్యక్రమాల కోసం నిధులు సేకరించాలనే గొప్ప సంకల్పంతో స్కైడైవింగ్ చేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ఈ సాహసం ద్వారా ఆయన సుమారు రూ. 4.76 లక్షలకు పైగా విరాళాలను సేకరించారు.
 
ఈ మొత్తాన్ని ఆయన 'రోలీస్ కమ్యూనిటీ సెంటర్'కు అందజేశారు. వయసు మళ్లినా ఆయన చూపిన సాహసం, సేవా దృక్పథంపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా, విమానం నుంచి స్కైడైవింగ్ చేసిన ఆ అద్భుత క్షణాలను తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

91 ఏళ్ల వయసులో ఈ అరుదైన ఘనత సాధించిన అలాన్ స్టిల్, అప్పుడే తన తదుపరి సాహసానికి సిద్ధమవుతున్నారు. బ్రిటన్‌లోని వేల్స్ ప్రాంతంలో గంటకు 160.9 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే 'జిప్ లైన్' రైడ్‌ను పూర్తి చేయడమే తన తదుపరి లక్ష్యమని ఆయన వెల్లడించారు.