అహోబిలంలో పొలిటికల్ హైటెన్షన్: భూమా అఖిలప్రియ వర్సెస్ గంగుల నాని

Bhuma Akhila Priya vs Gangula Nani Political High Tension in Ahobilam
  • ఆలయ తలనీలాల వ్యవహారంలో అఖిలప్రియకు ముడుపులు అందుతున్నాయన్న గుంగుల నాని
  • ఆరోపణలు నిరూపించాలంటూ అఖిలప్రియ సవాల్
  • తాను చేసిన ప్రతి ఆరోపణకు కట్టుబడి ఉన్నానన్న గంగుల నాని

నంద్యాల జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అహోబిలం వేదికగా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అహోబిలం ఆలయ తలనీలాల వ్యవహారంలో ఆరోపణలు, సవాళ్లతో స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, వైసీపీ నేత గంగుల బ్రిజేంద్రరెడ్డి అలియాస్ నాని మధ్య పొలిటికల్ వార్ పీక్స్‌కు చేరింది. తలనీలాల కాంట్రాక్ట్ వ్యవహారంలో అఖిలప్రియకు భారీగా ముడుపులు అందుతున్నాయని, ఇటీవల అవి అందకపోవడంతోనే ఆమె తలనీలాల తరలింపును అడ్డుకున్నారంటూ గంగుల నాని సంచలన ఆరోపణలు చేశారు.


గంగుల నాని చేసిన అవినీతి ఆరోపణలపై అఖిలప్రియ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. "నీ దగ్గర నిజంగానే ఆధారాలు ఉంటే అహోబిలం రా. అక్కడే తేల్చుకుందాం. తలనీలాల వ్యవహారంలో నా ప్రమేయం ఉన్నట్లు రుజువైతే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా" అంటూ సవాల్ విసిరారు. అన్నట్లుగానే అఖిలప్రియ తన అనుచరులతో కలిసి అహోబిలం చేరుకున్నారు. ఒకవేళ గంగుల నాని చర్చకు రాకపోతే, నేరుగా ఆయన ఇంటికే వెళ్లి నిలదీస్తానని స్పష్టం చేయడంతో ఉత్కంఠ మరింత పెరిగింది.


మరోవైపు ఎమ్మెల్యే విసిరిన ఛాలెంజ్‌పై గంగుల నాని కూడా వెనక్కి తగ్గలేదు. తాను చేసిన ప్రతి ఆరోపణకూ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. అఖిలప్రియకు ముడుపులు అందిన వ్యవహారానికి సంబంధించి తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇరువర్గాలు పంతాలకు పోవడంతో నంద్యాల జిల్లాలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisement
Bhuma Akhila Priya
Gangula Brijendra Reddy
Ahobilam Temple Controversy
Nandyal Political Tension
Andhra Pradesh Politics
Ahobilam Talanilalu Row

More Telugu News