కడియం శ్రీహరిపై రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసిన కొండా సురేఖ
- కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి
- తన శాఖ అధికారులతో తనకు సమాచారం ఇవ్వకుండా కడియం సమీక్ష నిర్వహించారన్న సురేఖ
- మంత్రిగా తన పరిధిని బేఖాతరు చేశారని మండిపాటు
- కడియంపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్
మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య ఆధిపత్య పోరు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతోంది. కడియం శ్రీహరిపై ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అయిన తనకే కనీస సమాచారం ఇవ్వకుండా... ఆ శాఖ ఉన్నతాధికారులతో కడియం ఏకంగా అధికారిక సమీక్ష నిర్వహించారంటూ మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఆమె నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మూడు పేజీల లేఖ రాస్తూ అధికారికంగా ఫిర్యాదు చేశారు. కడియం శ్రీహరి ప్రభుత్వ పరిపాలనా విధానాలను, మంత్రిగా తన అధికార పరిధిని పూర్తిగా బేఖాతరు చేశారని ఆమె సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
దేవాదాయ శాఖకు సంబంధించిన పరిపాలన, కీలక నిర్ణయాలు, అధికారిక సమీక్షలన్నీ పూర్తిగా సంబంధిత శాఖా మంత్రి పరిధిలోకే వస్తాయని కొండా సురేఖ స్పష్టం చేశారు. కానీ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదాయ శాఖ డైరెక్టర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులను పిలిపించుకుని... దేవాలయాల అభివృద్ధి, నిధుల కేటాయింపులు, మాస్టర్ ప్లాన్ల రూపకల్పన, భూముల పరిరక్షణ వంటి అంశాలపై సమీక్ష చేశారని లేఖలో మండిపడ్డారు. అంతేకాకుండా అధికారులకు డెడ్‌లైన్లు కూడా పెట్టడం పరిపాలనా పరంగా తీవ్ర అభ్యంతరకరమని, ఇది ప్రభుత్వ ‘రూల్స్ ఆఫ్ బిజినెస్’ స్ఫూర్తిని నిలువునా ఉల్లంఘించడమేనని తేల్చిచెప్పారు.
రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న కడియం శ్రీహరికి... శాఖా పరమైన నిర్ణయాలు మంత్రి ఆధ్వర్యంలోనే జరగాలనే కనీస విషయం తెలియదా అని కొండా సురేఖ నిలదీశారు. తనను పూర్తిగా పక్కనపెట్టి ఇలాంటి సమీక్షలు చేయడం ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థలో చెడు సంప్రదాయానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి అధికార యంత్రాంగంలో తీవ్ర అయోమయానికి కారణమవుతాయన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, కడియం శ్రీహరి నుంచి వివరణ కోరాలని... అలాగే పార్టీ క్రమశిక్షణా కమిటీ ద్వారా విచారణ జరిపించి ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కొండా సురేఖ కోరారు.