మళ్లీ అదే తప్పు చేస్తున్నారు: సెలెక్టర్ల తీరుపై మహ్మద్ కైఫ్ అసంతృప్తి
- సంజు శాంసన్‌ను పక్కన పెట్టేసిన సెలెక్టర్లు
- టీ20 ప్రపంచ కప్‌లో చేసిన తప్పునే మళ్లీ చేస్తున్నారన్న కైఫ్
- శాంసన్ వంటి అనుభవజ్ఞుడిని పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని వ్యాఖ్య
టీ20 ప్రపంచ కప్ తర్వాత భారత జట్టు వరుస వైఫల్యాలతో గెలుపు రుచి చూడలేకపోతోంది. ఐర్లాండ్‌తో సిరీస్ ఓటమి, ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్ రద్దు కాగా, రెండో టీ20లోనూ టీమిండియా 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ క్రమంలో, ఐర్లాండ్ పర్యటన నుంచి పేలవ ప్రదర్శన కనబరుస్తున్న స్టార్ ఓపెనర్ సంజు శాంసన్‌ను రెండో టీ20తో పాటు త్వరలో జరగబోయే జింబాబ్వే పర్యటన నుంచి కూడా తప్పించడం అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. శాంసన్ స్థానంలో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి జట్టులో అవకాశం కల్పించారు.
సంజు శాంసన్ తొలగింపుపై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ స్పందిస్తూ సెలెక్టర్ల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. గత టీ20 ప్రపంచ కప్‌లో చేసిన తప్పునే మేనేజ్‌మెంట్ మళ్లీ పునరావృతం చేస్తోందని విమర్శించాడు. టాపార్డర్‌లో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఇద్దరూ ఎడమచేతి వాటం బ్యాటర్లే కావడం వల్ల ప్రత్యర్థులు ఆఫ్ స్పిన్నర్లను దించి వికెట్లు తీసే ప్రమాదం ఉందన్నాడు. దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా టాపార్డర్‌లో తప్పనిసరిగా రైట్, లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ ఉండాలని, శాంసన్ వంటి అనుభవజ్ఞుడిని పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని కైఫ్ అభిప్రాయపడ్డాడు.
ఇదిలా ఉండగా, ఇప్పటికే ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో, నేడు నాటింగ్‌హామ్ వేదికగా జరగనున్న మూడో టీ20లో విజయం సాధించి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. అరంగేట్రం మ్యాచ్‌లో 14 పరుగులకే ఔటైన యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఈ కీలక మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు.