పాతబస్తీలో ఎస్ఐఆర్.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు

BJP complains to EC over voter list irregularities in Old City
  • హైదరాబాద్ పాతబస్తీలో ఓటర్ల నమోదుపై బీజేపీ అభ్యంతరం
  • ఇంటింటి సర్వే జరపకుండా మజ్లిస్ శిబిరాల్లో ఫారాల పంపిణీ జరుగుతోందని ఆరోపణ
  • బీఎల్ఓలు నిబంధనలు పాటించడం లేదని ఈసీకి ఫిర్యాదు
  • తెలంగాణ సీఈఓ సుదర్శన్ రెడ్డికి వినతిపత్రం సమర్పించిన బీజేపీ నేతలు
హైదరాబాద్ పాతబస్తీలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భారీ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డిని కలిసిన ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరగడం లేదని, దానికి బదులుగా మజ్లిస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన శిబిరాల ద్వారానే ఓటరు నమోదు ఫారాలను పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు.

కేవలం ఫారాల పంపిణీకే పరిమితం కాకుండా, పూర్తి చేసిన దరఖాస్తులను అప్‌లోడ్ చేసేందుకు వినియోగించే ఎన్నికల సంఘం అధికారిక యాప్‌ను సైతం మజ్లిస్ నేతలకే అప్పగిస్తున్నారని బీజేపీ తన ఫిర్యాదులో పేర్కొంది. పాతబస్తీతో పాటు జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్‌గిరి, వరంగల్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో చాలామంది ఓటర్లకు కనీసం దరఖాస్తు ఫారాలు కూడా అందలేదని వివరించింది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ సందర్భంగా పలు అంశాలను సీఈఓ దృష్టికి తీసుకెళ్లింది. హైదరాబాద్‌లో కేవలం ఆంగ్ల భాషలో, జిల్లాల్లో తెలుగులో ఫారాలను పంపిణీ చేయడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చి స్థిరపడిన ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది.

ఇంటింటి సర్వేను తప్పనిసరి చేయాలని, ఓటర్లు అందుబాటులో లేని పక్షంలో బీఎల్ఓలు కనీసం మూడుసార్లు వారి ఇళ్లను సందర్శించేలా ఆదేశాలు జారీ చేయాలని బీజేపీ విజ్ఞప్తి చేసింది. ఓటర్ల జాబితా సవరణ కోసం జూన్ 25న ప్రారంభమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ జూలై 24 వరకు కొనసాగనుంది. జూలై 31న ముసాయిదా జాబితాను, అక్టోబర్ 1న తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రచురించనుంది.
Advertisement
BJP
Hyderabad Old City Voter List
Telangana Election Commission
AIMIM Voter Registration Allegations

More Telugu News