టాయిలెట్లు కడిగిన బాలుడు... ఏఐ ప్రపంచాన్ని శాసిస్తున్న ఎన్విడియా సీఈవోగా ఎదిగాడు!

Jensen Huang The inspiring journey from childhood struggles to tech billionaire
  • తైవాన్‌లో జన్మించిన జెన్సెన్‌ హువాంగ్‌
  • తొమ్మిదేళ్ల వయసులో అమెరికాలో కష్టాల జీవితం
  • బోర్డింగ్‌ స్కూల్‌లో టాయిలెట్లు శుభ్రం చేసిన బాల్యం
  • జాత్యహంకారం, వేధింపులు ఎదుర్కొన్న రోజులు
  • ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో ఉన్నత విద్య
  • 1993లో ఎన్విడియా స్థాపన
జీవితం ఒక్కోసారి మనల్ని ఊహించని చోటికి తీసుకెళుతుంది. కానీ కష్టాలను అవకాశాలుగా మలచుకున్నవారే చరిత్ర సృష్టిస్తారు. ఎన్విడియా సీఈవో జెన్సెన్‌ హువాంగ్‌ ప్రయాణం కూడా అలాంటిదే. అవమానాలు, కష్టాలు, అనుకోని మలుపులతో మొదలైన ఆ కథ... నేడు ప్రపంచం స్ఫూర్తిగా చెప్పుకునే విజయగాథగా నిలిచింది.

1963లో తైవాన్‌లో జన్మించిన జెన్సెన్‌ హువాంగ్‌ చిన్నతనంలో కుటుంబంతో కలిసి థాయ్‌లాండ్‌కు వెళ్లారు. ఆ సమయంలో ఆగ్నేయాసియాలో రాజకీయ అస్థిరత పెరగడంతో తన ఇద్దరు కుమారులను అమెరికాకు పంపాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. వాషింగ్టన్‌లో ఉన్న బంధువు వద్దకు పంపారు. ఆయన పొరపాటున ప్రతిష్ఠాత్మక బోర్డింగ్‌ స్కూల్‌ అనుకుని కెంటకీలోని ‘వనిడా బాప్టిస్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌’లో చేర్పించారు. అది అల్లరి, క్రమశిక్షణ సమస్యలున్న పిల్లల కోసం నిర్వహించే ప్రత్యేక రెసిడెన్షియల్‌ పాఠశాల అని తర్వాత కుటుంబానికి తెలిసింది.

ఆ సమయంలో జెన్సెన్‌కు కేవలం తొమ్మిదేళ్లే. అక్కడ రోజూ టాయిలెట్లు శుభ్రం చేసే పని ఆయనకు అప్పగించారు. అన్నయ్య పొగాకు తోటలో పనిచేసేవాడు. సీనియర్‌ విద్యార్థుల వేధింపులు, జాత్యహంకార వ్యాఖ్యలు, కత్తులతో బెదిరింపులు కూడా ఎదుర్కొన్నారు. అయినా ఆ పరిస్థితులకు అలవాటు పడుతూ, ఎలాంటి పరిస్థితినైనా తట్టుకోవడం అప్పుడే నేర్చుకున్నానని జెన్సెన్‌ తర్వాత పలుమార్లు చెప్పారు.

రెండేళ్ల తర్వాత తల్లిదండ్రులు అమెరికాకు చేరుకుని అసలు విషయం తెలుసుకున్నారు. వెంటనే ఇద్దరినీ అక్కడి నుంచి తీసుకెళ్లి ఒరెగాన్‌లో స్థిరపడ్డారు. అక్కడే జెన్సెన్‌ పాఠశాల విద్య పూర్తి చేశారు. తర్వాత ఒరెగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ పూర్తి చేశారు.

ఉద్యోగ జీవితాన్ని ఏఎండీలో ప్రారంభించిన జెన్సెన్‌ తర్వాత ఎల్‌ఎస్‌ఐ లాజిక్‌లో పనిచేశారు. 1993లో క్రిస్‌ మలాచోవ్‌స్కీ, కర్టిస్‌ ప్రీమ్‌తో కలిసి ఎన్విడియాను స్థాపించారు. ప్రారంభ రోజుల్లో కంపెనీ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. ఒక దశలో మూతపడే పరిస్థితి కూడా వచ్చింది. అయినా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగారు.

మొదట కంప్యూటర్‌ గేమింగ్‌కు ఉపయోగపడిన ఎన్విడియా గ్రాఫిక్స్‌ చిప్‌లు, తర్వాత శాస్త్రీయ పరిశోధనలు, సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లు, ఇప్పుడు కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగం పెరగడంతో ఎన్విడియా ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది.

తన విజయానికి చిన్ననాటి కష్టాలే కారణమని జెన్సెన్‌ తరచూ చెబుతుంటారు. సౌకర్యాల్లేని పరిస్థితుల్లోనూ ఎలా నిలబడాలో, సమస్యల నుంచి పారిపోకుండా వాటిని ఎదుర్కోవాలో ఆ రోజులు నేర్పాయని ఆయన అంటారు. అందుకే ఆయన జీవితాన్ని నేడు లక్షలాది మంది యువత స్ఫూర్తిగా చూస్తున్నారు.
Advertisement
Jensen Huang
NVIDIA CEO
NVIDIA success story
Artificial Intelligence
Jensen Huang biography
Tech industry leader

More Telugu News