ఎత్తు పెరుగుతాడని తాడు కట్టి తలుపుకు వేలాడదీశారు! నిజంగా అలా జరుగుతుందా?

Child hung to door to increase height viral video sparks outrage
  • వేలాడదీస్తే ఎత్తు పెరుగుతున్నాడనేది మూఢనమ్మకం
  • ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవంటున్న నిపుణులు
  • ఎత్తుని ప్రభావితం చేసేది జన్యువులు, పోషకాహారం, నిద్ర, వ్యాయామం
  • వైరల్‌ అయిన వీడియో
  • వేధింపులేనంటే నెటిజన్ల ఆగ్రహం
ఎత్తు పెరుగుతాడనే మూఢనమ్మకంతో ఓ చిన్నారిని తలుపుకు తాడు కట్టి వేలాడదీసిన తల్లిదండ్రుల వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నారి బాధపడుతుండగా తల్లిదండ్రులు అతణ్ని అలాగే ఉంచడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పిల్లల భద్రత, తల్లిదండ్రుల బాధ్యతపై మరోసారి చర్చకు దారితీసింది.

వైరల్‌ వీడియోలో చిన్నారి తలుపు ఫ్రేమ్‌కు చేతుల వద్ద కట్టేసి వేలాడదీసినట్లు కనిపిస్తోంది. దీనిని గమనించిన ఓ మహిళ వారిని నిలదీయగా.. చిన్నారి తల్లి ‘‘ఇది మా వ్యక్తిగత విషయం’’ అంటూ బుకాయించే ప్రయత్నం చేసింది. అయితే పిల్లల భద్రత ఎప్పుడూ వ్యక్తిగత విషయం కాదని వీడియో తీసిన మహిళ వాదించింది.

చిన్నారిని ఇలా కడితే ఎత్తు పెరుగుతాడని తల్లిదండ్రులు నమ్మినట్లు వీడియోలో పేర్కొన్నారు. అయితే దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వ్యక్తి ఎత్తు ప్రధానంగా జన్యుపరమైన అంశాలపై ఆధారపడి ఉంటుందని, పోషకాహారం, తగిన నిద్ర, శారీరక వ్యాయామం, మంచి ఆరోగ్యమే పిల్లల ఎదుగుదలకు దోహదపడతాయని స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి చర్యలు ఎత్తు పెంచకపోగా శారీరక, మానసిక సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఈ వీడియోపై సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇది పేరెంటింగ్‌ కాదని, చిన్నారిపై వేధింపులేనని పలువురు వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై బాలల సంక్షేమ అధికారులు స్పందించాలని కూడా డిమాండ్‌ చేస్తున్నారు. మరికొందరు తమ చిన్నతనంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాల పేరుతో ఇబ్బందులు ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు. పిల్లల విషయంలో అపోహలు కాకుండా శాస్త్రీయ అవగాహనతో వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Advertisement
Child
Height Increase Superstition
Viral Video
Child Abuse
Parenting
Social Media Outrage

More Telugu News