టాటూ వేయించుకుంటున్నారా?.. శరీరంలో జీవితాంతం జరిగేది ఇదే!

Tattoo health risks and how ink affects your immune system
  • టాటూ సిరాను శరీరం పరాయి పదార్థంగా గుర్తిస్తుంది
  • తెల్ల రక్తకణాలు జీవితాంతం సిరాతో పోరాడుతుంటాయి
  • సిరా కణాలు లింఫ్‌ నోడ్స్‌లో పేరుకుపోవచ్చు
  • కొన్ని సిరాల్లో భారీ లోహాల ఆనవాళ్లు
  • రంగు సిరాలతో అలర్జీలు, ఇన్‌ఫ్లమేషన్‌ ప్రమాదం
పచ్చబొట్టు వేయించుకోవడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారింది. అయితే అందంగా కనిపించే ఆ టాటూ వెనుక ఆరోగ్యపరమైన ప్రమాదాలు కూడా దాగి ఉండొచ్చని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. దాన్ని వేయించుకున్న తర్వాత శరీరంలో రోగనిరోధక వ్యవస్థ జీవితాంతం ఆ సిరాతో పోరాడుతూనే ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

శరీరంలో ఏం జరుగుతుంది?
టాటూ వేస్తే చర్మం మధ్య పొరలోకి సిరా చేరుతుంది. దాన్ని బయటి నుంచి వచ్చిన పదార్థంగా శరీరం గుర్తిస్తుంది. వెంటనే తెల్ల రక్తకణాలు దానిపై దాడి చేస్తాయి. కానీ సిరా కణాలు చాలా పెద్దగా ఉండటంతో వాటిని పూర్తిగా తొలగించలేవు. అందుకే టాటూ శాశ్వతంగా అలాగే ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ అక్కడితో ముగియదు. సిరాలోని సూక్ష్మ కణాలు క్రమంగా శరీరంలోని లింఫ్‌ నోడ్స్‌కు చేరి అక్కడే పేరుకుపోతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇవే (లింఫ్‌ నోడ్స్‌) శరీర రోగనిరోధక వ్యవస్థలో కీలక భాగాలు.

సిరాలో దాగి ఉన్న ప్రమాదం
టాటూల కోసం ఉపయోగించే సిరాపై చాలా దేశాల్లో కఠిన నియంత్రణలు లేవని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం వాడుతున్న కొన్ని రంగులను మొదట కార్ల పెయింట్‌, ప్లాస్టిక్‌, ప్రింటర్‌ టోనర్‌ వంటి పారిశ్రామిక అవసరాల కోసం తయారు చేశారు. కొన్ని సిరాల్లో నికెల్‌, క్రోమియం, సీసం వంటి భారీ లోహాల ఆనవాళ్లు కూడా గుర్తించారు. ముఖ్యంగా ఎరుపు, పసుపు, నారింజ రంగు సిరాలు అలర్జీలు, దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్‌కు ఎక్కువగా కారణమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఓ వ్యక్తి ఎరుపు రంగు టాటూ కారణంగా చెమట పట్టే సామర్థ్యాన్ని, శరీర వెంట్రుకలను కోల్పోయిన ఘటనను కూడా నిపుణులు ప్రస్తావించారు.

క్యాన్సర్‌ ప్రమాదం ఉందా?
కొన్ని రంగుల టాటూలు ఎండలో ఎక్కువసేపు ఉండటం లేదా లేజర్‌తో తొలగించే సమయంలో హానికర రసాయనాలుగా మారే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇవి జన్యు మార్పులకు దారితీయవచ్చని ప్రయోగశాల అధ్యయనాల్లో గుర్తించారు. నలుపు రంగు సిరాలో వాహనాల పొగలో ఉండే కొన్ని హైడ్రోకార్బన్లు కూడా ఉండొచ్చని వెల్లడించారు. టాటూల వల్ల నేరుగా క్యాన్సర్‌ వస్తుందని ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ టాటూ వేయించుకున్న వారిలో చర్మ క్యాన్సర్‌ ప్రమాదం కొంత ఎక్కువగా కనిపించినట్లు కొన్ని అధ్యయనాలు సూచించాయి.

ఇవి గుర్తుంచుకోండి
టాటూ వేయించుకునే ముందు పరిశుభ్రత, ఉపయోగించే సిరా నాణ్యత గురించి తప్పకుండా తెలుసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు లేదా ఆటో ఇమ్యూన్‌ వ్యాధులతో బాధపడేవారు ముందుగా వైద్యులను సంప్రదించడం మంచిదని చెబుతున్నారు.
Advertisement
Tattoo
Tattoo health risks
Tattoo ink side effects
Immune system response to tattoos
Skin cancer and tattoos
Tattoo safety tips

More Telugu News