రష్యా బాల్టిక్ పోర్టులపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి.. భారత్‌కు చమురు వచ్చేది ఇక్కడి నుంచే!
- డ్రోన్ల శకలాలు పడి ఉస్ట్-లుగా, వైసోట్స్క్ ఓడరేవులకు నష్టం
- రష్యా ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు
- దాడి కారణంగా క్రిమియాలోని సెవాస్టోపోల్‌లో విద్యుత్ అంతరాయం
- ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపిన రష్యా అధికారులు
లెనిన్‌గ్రాడ్ ప్రాంతంపై ఉక్రెయిన్ ప్రయోగించిన 56 డ్రోన్లను కూల్చివేసినట్లు ఆ ప్రాంత గవర్నర్ అలెగ్జాండర్ డ్రోజ్‌డెంకో వెల్లడించారు. అయితే, ఆ శకలాలు పడటంతో ఉస్ట్-లుగా, వైసోట్స్క్ నౌకాశ్రయాల్లోని కీలక సదుపాయాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారులు పేర్కొన్నారు. రష్యా చమురు ఎగుమతులకు ఉస్ట్-లుగా అతిపెద్ద కేంద్రం కాగా, వైసోట్స్క్ పోర్టు ద్వారా చమురుతో పాటు ధాన్యం, బొగ్గు, సహజవాయువు ఎగుమతులు జరుగుతాయి. భారత్‌కు సైతం ఇక్కడి నుంచే ముడి చమురు సరఫరా అవుతుండటం గమనార్హం.
రష్యా ఇంధన ఎగుమతులను అడ్డుకోవడం ద్వారా ఆ దేశ ఆదాయ వనరులను దెబ్బతీయాలనే వ్యూహంతో ఉక్రెయిన్ వరుస దాడులకు పాల్పడుతోంది. ఈ దాడుల ప్రభావంతో క్రిమియాలోని రష్యా 'బ్లాక్ సీ ఫ్లీట్' కేంద్రమైన సెవాస్టోపోల్‌లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. అయితే, నౌకాశ్రయ పరిసరాల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని రష్యా అధికారులు స్పష్టం చేశారు.